రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం తిరిగి తిరిగి.. చివరకు..

26 Sep, 2019 09:49 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

రిటైర్డ్‌ ఉద్యోగి ఆత్మహత్య

కళాశాల మేడపై నుంచి దూకిన వైనం

సాక్షి, పుత్తూరు(చిత్తూరు): కుటుంబ పోషణ కష్టంగా మారింది. పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వస్తే అప్పులు తీర్చి ఉన్నంతలో జీవించాలని భావించిన ఆయనకు నిరాశే ఎదురైంది. నాలుగేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన కళాశాల మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పుత్తూరులో బుధవారం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరాజుకుప్పం గ్రామానికి చెందిన ఎం.మునస్వామి 30 ఏళ్ల క్రితం పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటెండర్‌గా ఒప్పంద ప్రాతిపదికన విధుల్లో చేరారు.

15 ఏళ్ల క్రితం అప్పటి ప్రిన్సిపల్‌ ఆయనను పర్మినెంట్‌ ఉద్యోగిగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఆడిటర్‌ విభాగం అధికా రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. అప్పటి నుంచి తనను పర్మినెంట్‌ చేయాలని మునస్వామి అధికారులను కలిసి వేడుకున్నారు. ఇది జరుగుతుండగానే మునస్వామి 2015లో ఉద్యోగ విరమణ చేశారు. తన కుటుంబ జీవనం, పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మిగిలిపోయా యి. తీర్చేందుకు తనకు రావాలసిన రిటైర్మెంట్‌ బెని ఫిట్స్‌ కోసం నాలుగేళ్లుగా గుంటూరు, కడపలో ఉన్నతాధికారులను కలిసి కోరుతూనే ఉన్నారు.

బుధవారం ఉన్నతాధికారి వస్తారనే సమాచారంతో కళాశాలకు వెళ్లారు. ఆయన రాలేదని తెలియడంతో తీవ్ర మనస్తాపం చెంది కళాశాల మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తే తప్ప మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేది లేదని బంధువులు తేల్చి చెప్పారు. డీఎస్పీ మురళీధర్‌ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఒకరిని, కళాశాల సూపరింటెండెంట్, మృతుడి బంధువులతో కలిపి కమిటీగా ఏర్పాటు చేసి కడప ఆర్‌జేడీ కార్యాలయానికి ఫైల్‌ పంపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చదవండి : కొడుకులు పట్టించుకోవడం లేదని..

మరిన్ని వార్తలు