వారి కుటుంబాల్లో వేదనే మిగిలింది

25 Dec, 2019 22:44 IST|Sakshi

వరుస ప్రమాదాలు ఈ ఏడాది ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గతేడాదితో పోల్చుకుంటే 2019లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగి దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి యావత్ భారతాన్ని శోక సంద్రంలో ముంచింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు ఆహూతయ్యారు. గోదావరి బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదన్ని మిగిల్చింది. ఇక రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నల్గొండ రహదారి ప్రజల రక్తం తాగేసింది. ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ప్రమాదాలను ఓ సారి పరిశీలిద్దాం..!

అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి..
తమిళనాడులో జనవరి 6న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకోట్టై జిల్లా తిరుమయం వద్ద అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న వ్యాన్, మరో కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మంటల్లో ఎగ్జిబిషన్‌
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనవరి 30 రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న400 స్టాళ్లను బూడిద చేశాయి.ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్‌లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం రూ. వందల కోట్లలో జరిగింది. పూర్తి వార్తకోసం క్లిక్‌ చేయండి

పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి
బీహార్‌లో ఫిబ్రవరి 3న ఘోర రైలు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతి చెందారు. దాదాపుగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాకు 30కి.మీ దూరంలో ఫిబ్రవరి 3న ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసింది.


నకిలీ మద్యానికి 34 మంది బలి
(ఫిబ్రవరి 8) : ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోని ఇరుగుపొరుగు జిల్లాల పరిధిలో కల్తీ మద్యం తాగి 34 మంది మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లో 16 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా ఝాబ్రెరా ప్రాంతం బాలుపూర్ గ్రామస్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్ పూర్ జిల్లాలో మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు ఫిబ్రవరి 7న వెళ్లారు. ఆతర్వాత  కల్తీ మద్యం తాగారు. ఈ ఘటనలో 16మంది మృతి చెందారు.

హోటల్లో మంటలు.. 17 మృతి
రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఫిబ్రవరి 12న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్‌ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ఉలిక్కిపడ్డ భారతావని
(ఫిబ్రవరి 14-26) : జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఫిబ్రవరి14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దెబ్బకు దెబ్బ
పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది.  40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను చావు దెబ్బతీసింది. . 2016 నాటి సర్జికల్‌ దాడుల్ని గుర్తుకు తెస్తూ, పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో జైషే నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా శిబిరాన్ని భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. బాంబుల్ని జారవిడిచి సుమారు 350 మంది ఉగ్రవాదులు, సీనియర్‌ కమాండర్లు, వారి శిక్షకుల్ని మట్టుపెట్టింది.
 

నెత్తురోడిన నల్లగొండ రహదారి
నల్లగొండ జిల్లాలో రహదారి నెత్తురోడింది. మార్చి 6న  హైదరాబాద్ నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న టాటా ఏసీ మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్‌ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.  బస్సు కూడా వేగంగా ఉండటంతో టాటాఏసీ  వాహనాన్ని 20అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది.  ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

విషాదం మిగిల్చిన విమానం
ఇథియోపియాలో మార్చి10న జరిగిన ప్రమాదంలో విమానం కూలిపోయింది.  ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్‌ 8 విమానం..బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. మొత్తం 157 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కెన్యా, ఇథియోపియా, కెనడా, చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఈజిప్టు, నెదర్లాండ్‌, స్లొవేకియా, భారత్‌కు చెందినవారు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పాదాచారులను మింగిన వంతెన
ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌(సీఎస్‌టీ) నుంచి అంజుమన్‌ కాలేజీ, టైమ్స్‌ ఆప్‌ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం మార్చి 12న రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. కసబ్‌ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెనపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్‌ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో  ఆ వంతెనకి కసబ్‌ బ్రిడ్జి అనేపేరు స్థిరపడిపోయింది.


ఛత్తీస్‌లో మావోల ఘాతుకం
(ఏప్రిల్‌ 9) : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చి పోయారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్‌ లక్ష్యంగా ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్భటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి
(ఏప్రిల్‌ 9) : నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేర్‌ శివార్‌లో మట్టిదిబ్బ కూలి 10 మంది మృతి చెందారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు. ఎండ ఎక్కువ ఉండడంతో నీళ్లు తాగేందుకు గుట్ట నీడ కిందికి వెళ్లారు. అదే సమయంలో ఓ చిన్న మట్టిపెళ్ల బోయిని మణెమ్మ అనే కూలీ మీద పడింది. వెంటనే తేరుకున్న ఆమె గుట్ట కూలేటట్టు ఉందని మిగతా కూలీలను అప్రమత్తం చేస్తుండగానే.. ప్రమాదం ఉప్పెనలా వచ్చింది. ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలడంతో పది మంది మట్టికింద సమాధి అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయడం

రాములవారి కల్యాణానికి వెళ్లి..
(ఏప్రిల్‌ 14) : సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఆటో ఢికొట్టి ఏడుగురు దుర్మరణం చెందారు. కోదాడ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మర సీతారామ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది.

అకాల వర్షాలకు 53 మంది బలి
రాజస్తాన్‌, గుజరాత్‌, మధ‍్యప్రదేశ్‌, మహారాష్ట్రలనే భారీ అకాల వర్షాలు కుదిపేశాయి. ఏప్రిల్‌ 16న కురిసిన భారీ వర్షాలకు నాలుగు రాష్ట్రాలతో కలిపి 53 మంది మరణించారు.  వర్షం కారణంగా అత్యధికంగా రాజస్తాన్‌లో 25 మంది, మధ్యప్రదేశ్‌లో 15 మంది, గుజజరాత్‌లో 10 మంది, మహారాష్ట్రలో ముగ్గురు చనిపోయారు.

ఈస్టర్‌ ప్రార్థనలపై ఉగ్రదాడులు.. 215 మంది మృతి
ఈస్టర్‌ పండుగరోజు(ఏప్రిల్‌ 21) శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేశారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. ఈ ప్రమాదంతో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500మందికితీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు సహా 33మంది విదేశీయులు మృతి చెందారు. ఇదే నెల 27న మరోసారి ఉగ్రవాదు రెచ్చి పోయారు. శ్రీలంక భద్రతాబలగాలపై కాల్పులు జరిపి తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో ఆత్మహుతి బాంబర్లతో సహా 15మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రెచ్చిపోయిన మావోలు..
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్తులు విసిరిన పంజాలో 15 మంది పోలీసులు మృతిచెందారు. కూబింగ్‌కు బయలుదేరిన పోలీసుల వాహనం లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ మందుపాతరను పేల్చారు. మే1న జరిగిన  ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర పోలీసు విభాగం క్విక్‌రెస్పాన్స్‌ టీం యూనిట్‌కు చెందిన 15 మంది కమాండోలతో పాటు ఓ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి పోలీసుల వాహనం తునాతునకలైంది. కాగా 2018 ఏప్రిల్‌లో క్యూఆర్టీ కమాండోలు ఓ ఆపరేషన్‌లో భాగంగా 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఇందుకు ప్రతిగానే మావోలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు  అధికారులు వెల్లడించారు.

విషాదం మిగిల్చిన పెళ్లి చూపులు
కర్నూల్‌ జిల్లా వెల్దుర్తి వద్ద మే11న  జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వచ్చిన బస్సు ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి అవతలివైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. ఓ పెళ్లి సంబంధం కుదుర్చుకొని తిరిగివస్తుండగా ఈ ఘటన చోటుచేసకుంది. మృతులంతా 25-40 ఏళ్లలోపే వారే.

15 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని పుణెలో గోడకూలి 15 మంది దుర్మరణం పాలయ్యారు. కుంద్వా ప్రాంతంలోని బడాతలావ్‌ మసీదు సమీపంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఎడతెరపి లేని కుండపోత వర్షాలకు నేల కుంగడంతో దాదాపు 22 అడుగుల రక్షణ గోడ కూలి షెడ్లపై పడింది. అక్కడే కార్లు పార్క్‌ చేయడంతో తీవ్రత మరింత పెరిగింది. అక్కడే నిద్రిస్తున్న 15 మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. కార్మికుంతా బిహార్‌ నుంచి వలస వచ్చినవారే. జూన్‌ 31న ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అదుపు తప్పిన బస్సు..
జమ్మూకాశ్మీర్‌లో జులై1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కేశవాన్ నుంచి కిష్టావర్ ప్రాంతానికి బయలుదేరిన మినీ బస్సు సిర్‌గ్వారి ప్రాంతంలో బస్సు మలుపు తీసుకుంటుండగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అగ్నికి ఆహుతి
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది మృతిచెందగా, మరో 27 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బటాలా ప్రాంతంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో సెప్టెంబర్‌ 4న భారీ పేలుడు సంభవించింది. బటాలా-జలంధర్‌ రహదారిలోని హన్సాలీ పుల్‌ వద్ద ఉన్న రెండస్తుల ఫైర్‌క్రాకర్‌ ఫ్యాక్టరీలో జరిగిన ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోయింది. నానక్‌ దేవ్‌ పెండ్లి మహోత్సవంతో పాటు పలు పండుగల నేపథ్యంలో కర్మాగారంలో కొన్ని రోజులుగా టపాసులు నిల్వ చేశారు. భారీగా నిల్వచేసిన పటాసులు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివాసాలకు కూడా మంటలు వ్యాపించాయి.

విషాదం మిగిల్చిన విహార యాత్ర
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద సెప్టెంబర్‌ 15న  పెను విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో 77 మందితో ప్రయాణిస్తున్న బోటు నదిలో బోల్తా పడడంతో 51 మంది మరణించారు. మరో 26 మందిని స్థానికులు రక్షించారు. ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగి 38 రోజుల తీవ్రంగా శ్రమించి బోటును, బోటులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పుణ్యక్షేత్రాలకు వెళ్లి..
తూర్పుగోదావరి జిల్లా మన్యంలో అక్టోబర్‌15 న జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుపల్లి- చింతూరు ఘాట్‌రోడ్‌లో వాల్మీకి కొండ వద్ద వీరు ప్రయాణిస్తున్న టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. రెండు ప్రైవేట్‌ టెంపో ట్రావెల్స్‌ వాహనాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన  24 మంది  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు బయలుదేరారు. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపో వాహనం ప్రమాదకర మలుపులో అదుపుతప్పి బోల్తాపడింది. 25 అడుగుల ఎత్తు నుంచి వ్యాన్‌ కిందపడడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు.

భారీ పేలుడు.. మృతదేహాలు ఛిద్రం
మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో అక్టోబర్‌31 న భారీ పేలుడు సంభవించింది. శిరపూర్‌ సమీపంలోని వాఘూడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్‌ కెమికల్‌ కంపెనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 65 మంది గాయపడ్డారు. పేలుడు శబ్దాలు సుమారు 10 కిలోమీటర్ల దూరం వినిపించాయి. పేలుడు తీవ్రతకు కొన్ని మృతదేహాలు కూడా ఛిద్రం అయ్యాయి.

భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలోని అనాజ్‌మండీలో ఉన్న ఫాక్టరీలో డిసెంబర్‌ 8న జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే జరగరాని నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భవనం రెండో అంతస్తు నుంచి మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ వస్తువులు నిల్ల ఉండడంతో మంటలు వెనువెంటనే వ్యాపించాయి.
శెట్టె అంజి, సాక్షి వెబ్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు