ఏసీబీ వలలో ఆర్‌ఐ

21 Aug, 2019 08:28 IST|Sakshi
చాగల్లులో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్‌ఐ సుబ్బారావు, చిత్రంలో ఏసీబీ డీఎస్పీ సుధాకర్‌ 

సాక్షి, చాగల్లు(పశ్చిమగోదావరి) : అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో రెవెన్యూ అధికారి చిక్కారు. పట్టాదారు పాస్‌పుస్తకం కోసం సొమ్ములు డిమాండ్‌ చేసిన అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంగళవారం చాగల్లు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఎస్‌.ముప్పవరం గ్రామానికి చెందిన రైతు అయినం దుర్గాప్రసాద్‌ వద్ద చాగల్లు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న గాడి సుబ్బారావు పొలం పట్టాదారు పాస్‌ పుస్తకం నిమిత్తం రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రైతు దుర్గాప్రసాద్‌ తండ్రి భీమయ్య మృతిచెందడంతో తండ్రి పేరు మీద ఉన్న  1 ఎకరా 75 సెంట్ల వ్యవసాయ భూమిని తన తల్లి కాంతమ్మ పేరుపై మార్చి పాస్‌ పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఈనెల 1న మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.

వీఆర్వో ధ్రువీకరించిన తర్వాత అతని దరఖాస్తు ఆర్‌ఐ సుబ్బారావు వద్ద పెండింగ్‌లో ఉంది. అప్పటి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ రైతు దుర్గాప్రసాద్‌ పలుమార్లు తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో పాస్ట్‌పుస్తకం కావాలంటే రూ.2 వేలు ఇవ్వాలని ఆర్‌ఐ సుబ్బారావు ఫోన్‌లో దుర్గాప్రసాద్‌ను డిమాండ్‌ చేశారు. దీంతో దుర్గాప్రసాద్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదు మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆర్‌ఐ సుబ్బారావుకు దుర్గాప్రసాద్‌ రూ.2 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. సుబ్బారావుపై పీసీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సుబ్బారావును రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీ సీఐలు కె.శ్రీనివాసరావు, ఎం.రవీంద్ర, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.

అనంతరం రైతు దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ తనకు పాస్‌పుస్తకం ఇప్పించాలని పలుమార్లు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగానని.. సొమ్ములు ఇస్తేనే పని అవుతుందని ఆర్‌ఐ సుబ్బారావు చెప్పడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయిం చానని చెప్పారు. ఆర్‌ఐ సుబ్బారావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. చాగల్లులో తహసీల్దార్‌ కార్యాలయంలో గతంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు కూడా అతనిపై ఫిర్యాదులు రావడంతో కొంతకాలం విధులకు దూరమయ్యారు. 

అవినీతిపై సమాచారం ఇవ్వండి 
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అవినీతి అధికారులపై తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్‌ అన్నారు. 94404 46157 ఫోన్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు