రైస్‌ పుల్లింగ్‌ మిషన్‌ పేరిట ఘరానా మోసం

13 Jun, 2019 08:13 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌ రావు

రూ. 32 లక్షలకు టోకరా

రూ. 18 లక్షల రికవరీ నిందితుడు అరెస్ట్‌

గచ్చిబౌలి: రైస్‌ పుల్లింగ్‌ యంత్రం ద్వారా రూ. వంద కోట్లు సొంతం చేసుకోవచ్చని ఆశ చూపి ఘరానా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేశామని మాదాపూర్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌ రావు తెలిపారు. బుధవారం మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ముంబైలోని బాంద్రాకు చెందిన స్టీల్‌ వ్యాపారిజితేష్‌ శాంతిలాల్‌ సోలంకి, అదే ప్రాంతానికి చెందిన సమీర్‌ రాయ్‌లు స్నేహితులు. బంద్రాలో ఉండే కోల్‌కతాకు చెందిన మరో స్నేహితుడు రాజ్‌ఖాన్‌ తన వద్ద రైస్‌ పుల్లింగ్‌ మిషన్‌ ఉందని జితేష్‌కు చెబుతుండే వాడు. జమీర్‌ రాయ్‌ తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షల కోసం జితేష్‌ను కలువగా రైస్‌ పుల్లింగ్‌ యంత్రం చేతికి వస్తుందని ఇప్పటికే రూ. 30 లక్షలు వచ్చాయని, ఇంకా రూ. 300 కోట్లు త్వరలోనే వస్తాయని, త్వరలోనే నీ అప్పు తీర్చతానని చెప్పాడు. తన స్నేహితుడైన రాజ్‌ఖాన్‌ వద్ద ఉన్న రైస్‌ పుల్లింగ్‌ యంత్రం ఉందని అమ్మి పెట్టాలని సూచించాడు.

బెంగళూర్‌లో స్నేహితుడి ద్వారా పరిచయం అయిన విశాఖపట్టణం, కళింగనగర్‌కు చెందిన సింగంపల్లి వాసు అలియాస్‌ దేవా(35) సైంటిస్టు అని అది నిజమైన రైస్‌పుల్లింగ్‌ యంత్రం అవునో కాదో అతను చెప్పగలడని జితెందర్‌ను నమ్మించాడు. ఈ క్రమంలోనే గత జనవరి 16న గోవాలోని వివెంట హోటల్‌లో దేవా, జితేష్, సమీర్‌ రాయ్, రాజ్‌ఖాన్‌లు కలిశారు. విలుఐన వెండి డ్రెస్సులో ఆర్‌ అండ్‌ డీలో రైస్‌పుల్లింగ్‌ యంత్రం టెస్ట్‌ చేసేందుకు రూ. 3.26 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడు. దేవా రూ. 1.63 కోట్లు, రాజ్‌ఖాన్‌ రూ. 1.10 కోట్లు, జితేష్‌ రూ. 52 లక్షలు పెట్టుబడిగా పెట్టేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఈ నెల 6న గచ్చిబౌలిలోని ఆదిత్య ఇన్‌లో నలుగురు కలిశారు. స్టీల్‌ వ్యాపారి అయిన జితేష్‌ రూ.32 లక్షలు దేవాకు ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే మిషన్‌ తీసుకొస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు. మిషన్‌ తీసుకొస్తే మిగిలిన డబ్బు ఇస్తానని రాజ్‌పై ఒత్తిడి తేవడంతో అతను చెప్పే సమాదానంపై అనుమానం కల్గింది. దీంతో జితేష్‌ ఈ నెల 6న గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగిలిన బ్యాలెన్స్‌ ఇస్తానని జితేష్‌ ద్వారా రప్పించి నిందితుడు దేవాను అరెస్ట్‌ చేశారు. నిందితుడు నుంచి రూ. 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌ఖాన్, సమీర్‌ శర్మలను అరెస్ట్‌ చేయాల్సి ఉందని డీసీపీ పేర్కొన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, గచ్చిబౌలిసీఐ శ్రీనివాస్, డీఐ సత్యనారాయణ తదితరులున్నారు.  

మిషన్‌ లేకుండానే మోసం
రాజ్‌ఖాన్‌ తన వద్ద రైస్‌ పుల్లింగ్‌ యంత్రం ఉందని చెప్పడం, సమీర్‌ రైస్‌ పుల్లింగ్‌ యంత్రం వస్తుందని అది వస్తే ఇరిడీయం ద్వారా రూ. 300 కోట్లు ఆర్జించ వచ్చని జితేష్‌ను ముగ్గులోకి దింపారు. స్నేహితుడు సమీర్‌ రాయ్‌ రైస్‌ పుల్లింగ్‌ మిషన్‌ విక్రయిస్తే వందల కోట్లు వస్తాయని చెప్పక ముందే రాజ్‌ ఖాన్‌ తన వద్ద రైస్‌ పుల్లింగ్‌ యంత్రం ఉందని పథకం ప్రకారం మోసానికి పాల్పడ్డారు. దేవాను కలిసిన తరువాత యూ ట్యూబ్‌లో రైస్‌ పుల్లింగ్‌ మిషన్, వెండి డ్రెస్‌తో ఆర్‌ అండ్‌ డీలో పరీక్షలు చేస్తారని చూపించి మోసానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి వ్యూహం పన్ని జతీష్‌ నుంచి అందిన కాడికి దండుకోవాలని భావించారు. ప్రధాన నిందితుడు కటాకటాల పాలవడంతో వ్యూహం బెడిసికొట్టినట్‌లైంది. 

మరిన్ని వార్తలు