పారని ‘చెంబు’ ప్లాన్‌

29 Mar, 2018 09:05 IST|Sakshi

చెంబు చూపించిటోకరాకు పథకం!

రైస్‌ పుల్లింగ్‌ పేరుతో విక్రయానికి యత్నం

నగర వాసి నుంచి రూ.20 వేలు స్వాహా

నలుగురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, సిటీబ్యూరో: ఓ ప్లాస్టిక్‌ టేబుల్‌... దాని కింద మైక్రోవేవ్‌ ఓవెన్‌... ఇది కనిపించకుండా వస్త్రాలతో సెట్టింగ్‌... బల్ల పైన ‘అతీంద్రియశక్తులున్న చెంబు’... దాని వైపు టార్చ్‌ లైట్‌ ఫోకస్‌ చేస్తే చాలా టప్పున మాడిపోయే బల్బు... ఇలాంటి సెటప్‌ ఏర్పాటు చేసిన ఓ ముఠా భారీ స్థాయిలో టోకరాలు వేయాలని ప్రయత్నించింది. అయితే ఓ నగరవాసి నుంచి రూ.20 వేలు స్వాహా చేయడంతోనే విషయం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ చేసింది. ఫలితంగా గ్యాంగ్‌కు చెందిన నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన సురేష్‌ యాదవ్‌ గత 20 ఏళ్లుగా వాల్‌ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి మహేష్‌ (రెంటల్‌ ఏజెంట్‌), ఎస్‌ఎస్‌ హుస్సేన్‌ (రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి), విశ్వనాథ్‌లతో (రియల్టర్‌) పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల క్రితం సురేష్‌ రైస్‌ పుల్లింగ్‌ వస్తువులు పేరుతో బిందెలు, చెంబుల క్రయవిక్రయాలు చేస్తూ కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్న విషయం గుర్తించాడు. తానూ అదే పం«థాలో టోకరాలు వేయాలని నిర్ణయించుకున్న సురేష్‌ మిగిలిన ముగ్గురికీ విషయం చెప్పాడు. వారూ అంగీకరించడంతో ముఠా కట్టిన ఇతగాడు ఓ వినూత్న ఆలోచన చేశాడు.

ప్లాస్టిక్‌ టేబుల్‌ కింది భాగంలో మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఏర్పాటు చేసి, అది కనిపించకుండా వస్త్రాలు కప్పి దాని వేడి టేబుల్‌కు ప్రసారమయ్యేలా సెట్‌ చేశాడు. ఈ టేబుల్‌ పైన కొన్ని చెంబులు ఉంచి వాటికి అతీంద్రియశక్తులు ఉన్నాయని, రైస్‌ పుల్లర్స్‌ అయిన వీటిని తమ దగ్గర ఉంచుకుంటే ఎన్నో శక్తులు వస్తాయంటూ ప్రచారం చేశారు. ఈ రైస్‌ పుల్లర్‌ చెంబులకు ఉన్న శక్తుల నేపథ్యంలో వాటిపై టార్చ్‌ లైట్‌ వేస్తే వెంటనే లైట్‌లోని బల్బు మాడిపోతుందంటూ అనేక మందిని నమ్మించాడు. దీనిని ప్రాక్టికల్‌గా చూపించేందుకు అదే టేబుల్‌పై టార్చ్‌ లైట్‌ ఉంచేవాడు. టేబుల్‌ నుంచి ఈ లైట్, అందులోని బ్యాటరీలు వేడిని సంగ్రహించేవి. ఇలా వేడెక్కిన టార్చ్‌ను ఆన్‌ చేసిన వెంటనే దాని బల్బు మాడిపోతుంది. ఆన్‌ చేసే ముందు వెలుగు చెంబుపై పడేలా చేసే ముఠా దానికి ఉన్న శక్తి కారణంగానే బల్బు మాడిందంటూ నమ్మించేది.

ఈ డెమోను అనేక మందికి చూపిన ఈ నలుగురూ సదరు రైస్‌ పుల్లింగ్‌ చెంబు ఖరీదు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటుందంటూ ప్రచారం చేశారు. వీటిని విక్రయిస్తామంటూ అడ్వాన్సులు తీసుకోవడం ప్రారంభించారు. భారీ మొత్తం కాజేయాలని స్కెచ్‌ చేసినప్పటికీ... సక్సెస్‌ కాలేదు. మహ్మద్‌ ఇమ్రాన్‌ అనే వ్యక్తి నుంచి రూ.20 వేలు కాజేశారు. ఈలోగా విషయం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు తెలియడంతో ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు ప్రభాకర్‌రెడ్డి, మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి వలపన్ని బుధవారం నలుగురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి చెంబులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని కేసును ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు