ప్రాణం ఖరీదు రూ.888!

8 Sep, 2018 09:04 IST|Sakshi
పూణేలో తలదాచుకున్న నివాసం

జంట పేలుళ్లకు రియాజ్‌ ఖర్చు చేసింది రూ.40 వేలు

45 మంది మృతి

‘మాల్‌ ఏ ఘనీమఠ్‌’కోసం పుణేలో కిడ్నాప్‌లకు కుట్ర

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ‘జంట పేలుళ్ల ’కోసం ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్‌ ఖర్చు చేసింది ఎంతో తెలుసా..? అక్షరాల రూ.40 వేలు మాత్రమే. గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ పేలుళ్లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు ఆపరేషన్‌ వెనుక ఉన్న విషయమిది. 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న ఈ రెండు పేలుళ్లు 45 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన సరాసరిన ఒక్కో హత్యకు వీరు రూ.888 చొప్పున ఖర్చు చేశారు. హైదరాబాద్‌ పేలుళ్ల తర్వాత వీరందరూ ఈ కుట్ర పురుడుపోసుకున్న పుణేలోని అశోక మీవ్స్‌ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ఆ నగరంలో కొన్ని కిడ్నాప్‌లు చేయడం ద్వారా ‘మాల్‌ ఏ ఘనీమఠ్‌’ సంపాదించాలని కుట్రపన్నారు. మంగళవారం దోషులుగా తేలిన అనీఖ్‌ షఫీద్‌ సయ్యద్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిల వాంగ్మూలాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

అనీఖ్‌కు ఇచ్చింది రూ.20 వేలు...
పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా నగరాన్ని టార్గెట్‌ చేయాలని భావించిన రియాజ్‌ భత్కల్‌ తన అనుచరుడు అనీఖ్‌ను హైదరాబాద్‌ పంపాలని నిర్ణయించుకున్నాడు. తొలుత ఫారూఖ్‌ బంధువైన నవీద్‌ను కలిసి, కంప్యూటర్‌ శిక్షణ కోసం వచ్చినట్లు చెప్పాలని సూచించాడు. ఆగస్టు 1న అతడికి రూ.20 వేలు ఇచ్చి పంపాడు. సరూర్‌నగర్‌లోని నవీద్‌ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న అనీఖ్‌ అక్కడి నుంచి పుణే వెళుతున్నట్లు చెప్పి నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. అయితే దాని అద్దె రోజుకు రూ.250 వరకు ఉండటంతో మరుసటి రోజే అజీజియా లాడ్జికి మకాం మార్చాడు. తన పేరు సతీష్‌ గౌక్వాడ్‌గా చెప్పుకుని రూ.120 అద్దెతో గది తీసుకున్నాడు. ఇక్కడ ఉంటూనే హబ్సిగూడ బంజారా నిలయంలోని ఫ్లాట్‌ నం.302లో దిగేందుకు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెలకు రూ.4 వేల అద్దె చెల్లించేందుకు అంగీకరించి రూ.12 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. 

అక్బర్‌ తెచ్చింది మరో రూ.6 వేలు...
ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్న అనీఖ్‌ ఈ విషయాన్ని పబ్లిక్‌ ఫోన్‌ ద్వారా రియాజ్‌కు చేరవేయడంతో ఆగస్టు 8న అక్బర్‌ను నగరానికి పంపిన రియాజ్‌... ఖర్చుల కోసం రూ.6 వేలు ఇచ్చాడు. అనీఖ్, అక్బర్‌ అమీర్‌పేటలోని ధూమ్‌ టెక్నాలజీస్‌లో హార్డ్‌వేర్‌ నెట్‌ వర్కింగ్‌ కోర్సులో చేరి రూ.5 వేలు చెల్లించారు. అక్బర్‌.. వినోద్‌ పాటిల్‌ పేరుతో చెలామణి అయ్యాడు. భత్కల్‌ ఆదేశాల మేరకు అనీఖ్‌ రూ.4 వేలతో కోఠిలో టీవీ కొనుగోలు చేశాడు. రియాజ్‌ భత్కల్‌ బంజారా నిలయానికి వచ్చిన తర్వాత అతడి సూచనల మేరకు సికింద్రాబాద్‌లోని రూ.360 వెచ్చించి మూడు బ్యాగులు కొన్నారు. ఆగస్టు 1 నుంచి 27 మధ్య (పేలుళ్ల తర్వాతా ఫ్లాట్‌లోనే రెండు రోజులు ఉన్నాడు) భత్కల్‌ రెండుసార్లు వచ్చిపోవడానికి, బాంబుల తయారీ, ఇతర ఖర్చులకు మరో రూ.14 వేలు వెచ్చించినట్లు అనీఖ్, అక్బర్‌ చెప్పుకొచ్చారు. ఇలా మొత్తమ్మీద జంట పేలుళ్ల ఆపరేషన్‌ పూర్తి చేయడానికి రియాజ్‌ వెచ్చించింది రూ.40 వేలు. పేలుళ్ల అనంతరం ఆగస్టు 27న అనీఖ్‌ పుణేకు తిరిగి వెళ్లిపోయాడు.  

పుణేలో కిడ్నాప్‌లకు కుట్ర...
పేలుళ్ల తర్వాత అనీఖ్, అక్బర్, రియాజ్‌ వేర్వేరుగా పుణే చేరుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు పుణేలోని అశోక మీవ్స్‌ అపార్ట్‌మెంట్‌లో సమావేశం కాగా, రియాజ్‌ తన కుట్రను బయటపెట్టాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన డబ్బు (మాల్‌ ఏ ఘనీమఠ్‌) కోసం కిడ్నాప్‌లు చేయాలని చెప్పాడు. పుణేలోని ప్రముఖ నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ లుంకడ్‌ బిల్డర్స్‌ యజమానిని తొలి టార్గెట్‌గా చేసుకున్నారు. అక్కడి విమాన్‌నగర్‌లో ఉన్న అతడి కార్యాలయం, క్యాంప్‌ ఏరియాలోని కౌన్సిల్‌ హాల్‌ ఔట్‌పోస్ట్‌ల వద్ద రెక్కీ చేసే బాధ్యతలను రియాజ్‌.. అనీఖ్, అక్బర్‌కే అప్పగించాడు. ఇతడితో పాటు రంక జ్యూవెలర్స్‌ యజమాని కుమారుడినీ టార్గెట్‌గా చేసుకుని గణేశ్‌ పేట్‌లోని అతడి కార్యాలయం, మార్షినగర్‌లోని ఇంటి వద్ద సైతం వీరితో రెక్కీ చేయించాడు. ఒక్కొక్కరి వెనుక పక్షం రోజుల పాటు రెక్కీలు చేయించిన రియాజ్‌ ఆపై హఠాత్తుగా వదిలేయాలంటూ చెప్పాడు. జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో అనీఖ్, అక్బర్‌లను మంగళవారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనుంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా