రేప్‌ ఎలా చేశారో చెప్పు...

17 Jun, 2018 11:49 IST|Sakshi
పోలీస్‌ వాహనంలో బాధితురాలు.. పక్కన ఆమె తండ్రి

మైనర్‌​ బాలికపై జరిగిన అకృత్యాన్ని రాజకీయం చేద్దామనుకున్న నేతలు అడ్డంగా బుక్కైపోయారు. బిహార్‌లో సంచలనం సృష్టించిన గయ తల్లికూతుళ్ల సామూహిక అత్యాచారం కేసులో కొందరు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేప్‌ ఎలా జరిగిందో? చెప్పాలంటూ బాధితురాలిని ఇబ్బందులకు గురి చేయటంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పట్నా: గయ జిల్లా సోనిదిహ్‌ గ్రామం సమీపంలో బుధవార రాత్రి ఓ వైద్యుడ్ని చితకబాది చెట్టుకు కట్టేసి, తుపాకీతో బెదిరించి అతని భార్య(35), కూతుళ్ల(15) 20 మంది గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తుల సాయంతో మరుసటి రోజు ఉదయం(గురువారం) కల్లా నిందితులందరినీ అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన బిహార్‌తోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో బాధితురాలైన మైనర్‌ బాలికను శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న కొందరు ఆమెను బలవంతంగా కిందకి దించి పరామర్శించారు. ‘నీపై రేప్‌ ఎలా జరిగింది?.. ఎంత మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. మీ అమ్మ ఆ సమయంలో ఏం చేస్తోంది?... అంటూ ఇలా ప్రశ్నలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఆ బాలిక ఇష్టం లేకుండానే సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. అడొచ్చిన పోలీస్‌ సిబ్బందిని నెట్టేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శించారు.

ఆర్జేడీ నేతలపై కేసులు.. తొలుత ఆ వీడియోలు, ఫోటోలు ఆర్జేడీ నేతల ట్విటర్‌ అకౌంట్‌లలో, పార్టీ అధికారిక పేజీల్లో చక్కర్లు కొట్టాయి. ఆపై స్థానిక మీడియా ఛానెళ్లలో కూడా హల్‌ చల్‌ చేయటంతో పోలీసులు ఆర్జేడీ నేతలపై కేసు నమోదు చేశారు. ఆర్జేడీ జాతీయ కార్యదర్శి మెహతా, బెలగంజ్‌ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, మహిళా విభాగం ప్రెసిడెంట్‌ అభ్‌లతా, జిల్లా అధ్యక్షుడు ముర్షిద్‌ అలమ్‌, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరస్వతి దేవీ.. తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పోలీసుల విధులకు విఘాతం కలిగించారన్న అభియోగాలను కూడా వారిపై నమోదు చేసినట్లు డీఐజీ ప్రకటించారు. 

తేజస్వి గుస్సా... అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయించిందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ చెబుతున్నారు. ఘటనపై నిజనిర్దారణ కమిటీ నియమించినట్లు, దానికి స్వయంగా తానే నేతృత్వం వహిస్తున్నట్లు తేజస్వి తెలిపారు. ఆరోపణలు రుజువైతే అందరిపై చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మెహతా కూడా తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు బాధితులకు వైద్య పరీక్షలకు పంపాలి. కానీ, ఆలస్యంగా పోలీసులు ఆమెను తీసుకెళ్లటంతో అనుమానం వచ్చి అడ్డుకున్నాం. ఆమెతో మాట్లాడుతున్న సమయంలో మీడియా అక్కడికి వచ్చింది. అందుకే బాధితురాలు మాపై అసహనం ప్రదర్శించింది. అంతేతప్ప మేమేం ఆమెను ఇబ్బంది పెట్టలేదు’ అని మెహతా మీడియాకు తెలిపారు.

బాధితురాలి మాట్లలో.. నేను బతిమాలుతున్న నన్ను బలవంతంగా వాహనం నుంచి దించేశారు. నన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. అరిచేశా... ఆ మృగాళ్లకు ఉరి శిక్ష పడేదాక నా ముఖం ప్రపంచానికి చూపించకూడదనుకున్నా. కానీ, నేతల అత్యుత్సాహం నా ఉనికిని ప్రపంచానికి తెలియజేసింది.

మరిన్ని వార్తలు