హైవేపై దడ..దడ

11 Jul, 2018 11:12 IST|Sakshi
గట్టుగూడెం వద్ద ప్రమాద స్థలం 

ట్యాంకర్, కంటైనర్‌ ఢీతో స్తంభించిన ట్రాఫిక్‌

ప్రమాదకర కెమికల్‌తో నెలకొన్న భయం

దమ్మపేట: మండల పరిధిలోని గట్టుగూడెం వద్ద హైవేపై మంగళవారం ట్యాంకర్, కంటైనర్‌ ఢీకొన్న ఘటనతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ డ్రైవర్, క్లీనర్లు గాయాలతో బయట పడ్డారు. దమ్మపేట ఎస్సై జలకం ప్రవీణ్‌ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌ నుంచి గ్రానైట్‌ రాళ్లతో కాకినాడ వెళుతున్న లారీని ఎదురుగా వస్తున్న గుజరాత్‌కు చెందిన ట్యాంకర్‌ డ్రైవర్‌ ఓవర్‌టేక్‌ చేయబోయాడు.

అదే సమయం లో హర్యానా నుంచి వైజాగ్‌ వెళ్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ లారీ, కంటైనర్లు ధ్వంసం అయ్యాయి. ట్యాంకర్‌ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గుజరాత్‌ ట్యాంకర్‌ డ్రైవర్, క్లీనర్లు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సత్తుపల్లికి తరలించారు.

అశ్వారావుపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.అబ్బయ్య పరిశీలించారు. ప్రమాదం కారణంగా హైవేపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సీఐ అబ్బయ్య, దమ్మపేట, అశ్వారావుపేట ఎస్సైలు ప్రవీణ్, వెంకటేశ్వరరావులు ట్రాఫిక్‌ను క్లీయర్‌ చేశారు. 

అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో రక్షణ.. 

కంటైనర్‌ను ఢీ కొట్టిన ట్యాంకర్‌లో ప్రమాదకర మైన మిథిలిన్‌ ఫ్లోరైడ్‌ బల్క్‌ కెమికల్‌ ఉంది. ప్రమాద సమయంలో అది ఏమాత్రం లీకేజీ అయినా పెద్దఎత్తున మంటలు చెలరేగే ప్రమాదముందని గుర్తించిన సీఐ అబ్బయ్య వెంటనే అశ్వారావుపేట అగ్నిమాపక శాఖ బాధ్యులు దేవనంది శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు.

ఆయన సిబ్బందితో ప్రమాదస్థలానికి చేరుకుని దాదాపు ఆరుగంటలు శ్రమించి..అక్కడ ఎలాంటి మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించారు. అగ్నిమాపక సిబ్బంది వై.వెంకటేశ్వర్లు, జీ.శ్రీను, వీరబాబు, టి.చెన్నారావులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు