డ్రైవర్‌ మృతి.. 13 మంది క్షతగాత్రులు

23 Nov, 2019 10:35 IST|Sakshi
తుఫాన్‌లో ఇరుక్కున్న వారిని బయటకు తీయడానికి యత్నిస్తున్న ఎస్‌ఐ నరేష్, స్థానికులు

సాక్షి, అడ్డాకుల (దేవరకద్ర): అతివేగంగా వచ్చిన ఓ కారు డివైడర్‌ను దాటుకుని పక్క రోడ్డుపై వెళ్తున్న తుఫాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాన్‌ ముందు భాగంలో కూర్చున్న వారంతా అందులోనే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. దాదాపు 30నిమిషాలపాటు పోలీసులు, స్థానికులు శ్రమించి వారిని బయటికి తీయగలిగారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. తీవ్రగాయాలైన డ్రైవర్‌ మృతిచెందాడు. మరో 13మందికి గాయాలుకాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అడ్డాకుల శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది.  
శుభకార్యానికి వెళ్తుంటే ప్రమాదం
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం తుఫాన్‌ వాహనంలో కొత్తకోటకు బయలు దేరారు. కర్నూల్‌కు చెందిన లక్ష్మిదేవి కారులో హైదరాబాద్‌కు వెళ్తోంది. అడ్డాకుల శివారులోకి వచ్చే సరికి కారు అదుపు తప్పి డివైడర్‌ మీదుగా దూసుకెళ్లి పక్క రోడ్డులో వెళ్తున్న తుఫాన్‌పై పడింది. దీంతో తుఫాన్‌ డ్రైవర్‌తో పాటు ముందు సీటులో కూర్చున్న వారు అందులో ఇరుక్కు పోయారు. వీరిని అడ్డాకుల ఎస్‌ నరేష్‌తో పాటు స్థానికులు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. తుఫాన్‌ డ్రైవర్‌ శ్రీనివాసులు(23) తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ముందు సీట్లో కూర్చున్న శంకరయ్య, యుగేందర్‌ తీవ్రంగా గాయపడ్డారు.

అదే వాహనంలో ఉన్న లలితకు తీవ్ర గాయాలయ్యాయి. సరోజ, నారాయణ, నాగప్ప, జ్యోతి, నర్సిములు, రాజు, వెంకటయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్న లక్ష్మిదేవి, కుమారుడు అనువంశ్, ఆమె తల్లి రుక్మినమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుడు శ్రీనివాసులు భూత్పూర్‌ మండలం హస్నాపూర్‌ వాసి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

కారు వేగం వందకుపైనే..
ప్రమాద సమయంలో కారు వందకు పైగా వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అతివేగంగా వెళ్తూ అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత పక్క రోడ్డుపైకి దూసుకెళ్లింది. తుఫాన్‌ను కారు నేరుగా ఢీకొట్టకుండా గాలిలోకి ఎగిరి దానిపై పడినట్లు ప్రత్యక్ష సాక్షి శివనారాయణ తెలిపారు. కారు ఎగిరి తుఫాన్‌పై పడగానే ముందు సీట్లో ఉన్న వారు అందులో ఇరుక్కోవడంతో తీవ్రగాయాలై డ్రైవర్‌ మృతి చెందాడు. ప్రమాదానికి గురైన రెండు వాహనాలు డివైడర్‌ పైనే పడ్డాయి.  

మరిన్ని వార్తలు