-

ప్రాణాలు తీసిన ట్రావెల్స్‌ బస్సు

27 May, 2018 09:52 IST|Sakshi
వాహనంలో ఇరుక్కుపోయిఉన్న డ్రైవర్‌ పుల్లారెడ్డి, సుబ్బులు  

అప్పుడే తెల్లవారుతోంది. జాతీయ రహదారిపై భారీ శబ్దం. ఏం జరిగిందో అని ఉలిక్కి పడిన జనం రోడ్డు మీదకు వచ్చే సరికి భీతావహు పరిస్థితి. రోడ్డుపై క్షతగాత్రులు రక్తపు మడుగులో చెల్లాచెదురుగా పడి ఉన్నారు. వాహనంలో ఇరుక్కున్న ఇంకొందరి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం ధ్వనించింది. వాహనంలో కూర్చున్న స్థితిలోనే డ్రైవర్, మహిళ, తల్లి ఒడిలోనే ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గడియల్లో దైవ సన్నిధికి చేరుకుంటామనుకున్న కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుతూనే ఈ ఘోర కలిని చూసిన స్థానికులు చలించిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలో చేయ్యేసి రోడ్డుపై పడిన, వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను వెలికి తీసి 108 వాహనాల్లో నాయుడుపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర దుర్ఘటన పెళ్లకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామస్తులు. 

పెళ్లకూరు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా పెళ్లకూరు వద్ద శనివారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనా స్థలిలో క్షతగ్రాతుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవగా, 12 మంది గాయపడ్డారు. ట్రావెల్స్‌ బస్సును తుఫాన్‌ వాహనం ఢీకొనడంతో గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన మాసబోయిన సుబ్బులు, చిన్నారి సాయివెంకటచరణ్‌ (3), డ్రైవర్‌ వెన్నపూస పుల్లారెడ్డి (28) అక్కడికక్కడే మృతి చెందగా, మరో చిన్నారి పూజితను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలి లో తీవ్ర రక్త గాయాలైన క్షతగాత్రులు కాపాడండి.. అంటూ ఆర్తనాదాలు చేశారు. తీవ్రంగా గాయపడిన పత్తి శీను, కోటేశ్వరమ్మ దంపతులతో పాటు బంధువులు ఆంజనేయులు, భూలక్ష్మి, ఇనుముల పుల్లమ్మ, నాగరాజు, ఎడ్ల చరణ్, ఎడ్ల శీను, కత్తి ఆదిలక్ష్మి, ఇనుముల భార్గవి, ఇనుముల శ్రీనివాసులు, ఇనుముల వెంకటేష్‌ గాయాలతో కొందరు వాహనంలో ఇంకొందరు నడిరోడ్డుపై చెల్లాచెదురుగా పడి సాయం కోసం చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి.

సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మహ్మద్‌ హనీఫ్‌ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను నాయుడుపేట వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, స్థానికుల చొరవతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ రాంబాబు, డీటీసీ శివరామ్‌ప్రసాద్, ఆర్‌టీవో చం దర్, ఎంవీఐ జకీర్‌ ప్రమాదస్థలిని పరి శీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు