పరామర్శకు వచ్చి పరలోకాలకు.. 

28 Apr, 2019 10:43 IST|Sakshi
సంఘటన స్థలంలో పోలీసులు, మృతులు రాజాగౌడ్, రాజేశ్వర్‌ (ఫైల్‌) 

బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌

ఇద్దరి దుర్మరణం

నిర్మల్‌టౌన్‌: ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించడానికి వచ్చిన ఇద్దరు స్నేహితులు పరలోకాలకు పయనమైన సంఘటన నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో శనివారం బైక్, టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదంలో వీరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మామడ మండలం పరిమండల్‌ గ్రామానికి చెందిన దొంతుల రాజేశ్వర్‌(48), గున్నాల రాజాగౌడ్‌(47) మంచి స్నేహితులు. దొంతుల రాజేశ్వర్‌ బంధువులు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని పరామరించేందుకు బైక్‌పై నిర్మల్‌ బయలుదేరిన రాజేశ్వర్‌తో రాజాగౌడ్‌ సైతం వచ్చాడు. ఈ క్రమంలో మంచిర్యాల చౌరస్తా వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడడంతో బైక్‌ ఆపారు. కొంత సేపటికి గ్రీన్‌ సిగ్నల్‌ పడడంతో బైక్‌ను నిర్మల్‌ వైపు పోనిచ్చే క్రమంలో టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయారు. టిప్పర్‌ డ్రైవర్‌కు బైక్‌ కనబడకపోవడంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న రాజేశ్వర్‌ టిప్పర్‌ టైర్ల కింద నలిగి తీవ్రగాయాలపాలయ్యాడు. వెనుక కూర్చున్న రాజాగౌడ్‌ టిప్పర్‌ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు రాజేశ్వర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో తనువు చాలించాడు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ డ్రైవర్‌ రోహన్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరణంలోనూ వీడని బంధం..
దొంతుల రాజేశ్వర్, గున్నాల రాజాగౌడ్‌ ప్రాణస్నేహితులు. రాజేశ్వర్‌ వ్యవసాయం చేస్తూనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా ఉన్నాడు. రాజాగౌడ్‌ కల్లుగీత కార్మికుడు. రాజేశ్వర్, రాజాగౌడ్‌ తరచుగా పరిమండల్‌ నుంచి జిల్లాకేంద్రానికి వస్తుండేవారు. ఇద్దరిలో ఎవరికి పని ఉన్నప్పటికీ కలిసే వచ్చేవారు. అదే క్రమంలో శనివారం రాజేశ్వర్‌తో రాజాగౌడ్‌ నిర్మల్‌కు వచ్చారు. ఇదే సమయంలో అనుకోకుండా టిప్పర్‌ రూపంలో ఈ ప్రాణస్నేహితులను మృత్యువు కబలించింది. మరణంలోనూ వీడని వీరి బంధాన్ని చూసి గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, దొంతుల రాజేశ్వర్‌కు భార్య, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. గున్నాల రాజాగౌడ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

మరిన్ని వార్తలు