గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఘటనపై సీఎం ఆరా 

21 Feb, 2020 12:19 IST|Sakshi

ట్రాక్టర్‌ ట్రక్కు బోల్తాపడి ఆరుగురి దుర్మరణం 

9 మందికి తీవ్ర గాయాలు

మృతులంతా చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్‌నగర్‌ వాసులు

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో గురువారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ ట్రక్కు బోల్తా కొట్టి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన యువతి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆ కాలనీవాసులు తెనాలి సమీపంలోని చినరావూరు వెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రోడ్డు మలుపులో ట్రాక్టర్‌ ట్రక్కు బోల్తా కొట్టింది. దీంతో గోరోజనం అన్నమ్మ(45), ఉన్నం పద్మావతి (32) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన వారిని తెనాలిలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. దగ్గుబాటి హర్షవర్ధన్‌మురళి (9), కట్టుపల్లి నిఖిల్‌ (7) కూడా మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

గోళ్ల నాగరాణి(34), గుత్తికొండ శ్యామ్‌(13)ల పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతిచెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 40 మంది వరకూ ప్రయాణిస్తున్నట్టు సమాచారం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే అది బోల్తా కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. తెనాలి డీఎస్పీ కె.శ్రీలక్ష్మి నేతృత్వంలో చుండూరు సీఐ బి.నరసింహారావు, చుండూరు, అమృతలూరు ఎస్‌ఐలు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకుని బాధితులను పరామర్శించారు. 

ప్రమాద ఘటనపై సీఎం ఆరా 
ప్రమాద ఘటనపైన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్‌ను ఆదేశించారు. మృతులు అన్నమ్మ, పద్మావతి, నాగరాణి కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షలతో పాటు ప్రభుత్వ పరిహారంగా ఒక్కొక్కరికి అదనంగా మరో రూ.2 లక్షలు ఇస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. చిన్నారులు హర్షవర్ధన్‌మురళి, నిఖిల్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నట్టు తెలిపారు.
 

మరిన్ని వార్తలు