ఆ బస్సు అటు ఎందుకు వచ్చినట్టు? 

25 Oct, 2019 12:43 IST|Sakshi
మృతదేహం వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు 

కుమారుడి పెళ్లి శుభలేఖలు పంచుతూ తండ్రి దుర్మరణం 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ప్రమాదం 

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, ప్రకాశం (పీసీపల్లి) : కుమారుడి పెళ్లి కార్డులు బంధువులకు పంచేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని బండపాలెం సమీపంలో గురువారం జరిగింది. వివరాలు.. పామూరుకు చెందిన పికిలి పెద కొండయ్య (43) కుమారుడు నరేంద్రకు ఈ నెల 29న వివాహం నిశ్చయమైంది. కుమారుడి వివాహ పత్రికలు బంధువులకు పంచేందుకు పెద కొండయ్య బైకుపై మరో వ్యక్తితో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతున్నారు. బండపాలెం సమీపంలో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ప్రమాదంలో పెద కొండయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక తోడుగా వస్తున్న బరిగే శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.   

కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు 
పెద కొండయ్య కుటుంబం బెంగళూరులో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమారుడి పెళ్లి కార్డులు పంచుతూ ఇంటి యజమాని మరణించడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భార్య సుజాత, కుమార్తెలు మౌనిక, మనీష ఉన్నారు. పెద కుమారుడు నరేంద్రకు స్వగ్రామం పామూరులో వివాహం జరగనుంది. కనిగిరి మండలం కంఠంవారిపల్లికి చెందిన ఓ యువతి వివాహం బుధవారం జరిగింది. ఆ యువతిని నెల్లూరు జిల్లా ఇచ్చారు. నెల్లూరులో పెళ్లి ముగించుకుని అమ్మాయి తరఫు బంధువులను స్వగ్రామంలో దింపేందుకు బస్సు వచ్చింది. తిరిగి కందుకూరు వెళ్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ రమణయ్య తెలిపారు. కొండయ్య మృతదేహం పోస్టుమార్టం కోసం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

విలపిస్తున్న పెళ్లి కుమారుడు నరేంద్ర  
పెళ్లి కార్డులు ఇస్తూ ...
పామూరు: పట్టణంలోని అంకాళమ్మ వీధికి చెందిన పెదకొండయ్య తాను సొంత కుమారుడిలా పెంచుకున్న తన వదిన కుమారుడి వివాహం ఈ నెల 29 రాత్రికి జరగాల్సి ఉంది. శుభలేఖలు బంధువులకు ఇచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. తన వదిన (భార్య అక్క) చనిపోవడంతో ఆమె కుమారుడు నరేంద్రను కూడా సొంత కుమారుడిలా చిన్నతనం నుంచి తన పిల్లలతో పాటు పెంచుకుంటున్నాడు. మరో నాలుగు రోజుల్లో పెళ్లి కావాల్సిన ఇంట్లో వ్యక్తి మృత్యువాత పడటంతో ఆ ఇంట ఆనందం ఆవిరైపోయింది. ప్రమాదవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతూ సంఘటన స్థలానికి వెళ్లారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు