ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

17 Jun, 2020 14:43 IST|Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతులను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్రామం నుంచి దాదాపు 30 మంది మంగళవారం ట్రాక్టర్‌లో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనానికి వెళ్లారు. రాత్రి ఆలయంలోనే బస చేశారు. బుధవారం ఉదయం మొక్కులు చెల్లించుకొని ఇంటికి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
కృష్ణాజిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వాసులు దుర్మరణం చెందడం పట్ల తెలంగాణముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.

ఏపీ గవర్నర్‌ సంతాపం
వేదాద్రి రోడ్డు ప్రమాద సంఘటనలో 13 మంది మృతి పట్ల ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు