వెంటాడిన మృత్యువు

30 Apr, 2018 10:09 IST|Sakshi
ప్రమాద స్థలంలో నుజ్జునుజ్జయిన వాహనం

వైఎస్సార్‌ కడప జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం

ఏడుగురు అనంత వాసుల దుర్మరణం

వివాహం కోసం  తిరుపతి వెళ్తుండగా ఘటన

మృతుల్లో పెళ్లి కుమార్తె తండ్రి శివప్రసాద్‌

గుంతకల్లు, కొప్పలకొండ, వెంకటాంపల్లిలో విషాదఛాయలు

తిరుపతిలో వివాహ వేదిక..సరిగ్గా వేకువజామున 3 నుంచి 4 గంటల మధ్య కల్యాణం.. ముందస్తుగా వధువు తల్లి కొంతమంది బంధువులతో కల్యాణ మంటపానికి చేరుకున్నారు. ముఖ్యమైన బంధువులు మరికొందరిని తీసుకొని తండ్రి తుఫాన్‌ వాహనంలో బయల్దేరారు. వేదిక వద్ద పెళ్లి సందడి..అంతా హడావుడి.. కొన్ని క్షణాల్లో పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. త్వరలో వేదిక వద్దకు చేరుకుంటామనుకుంటుండగా అంతలోనే మృత్యు ‘తుఫాన్‌’ లారీరూపంలో దూసుకొచ్చింది.. మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడవాల్సిన ఆ వధువు.. తమ బంధువులు ఏడుగురు మరణించారని తెలిసి.. ఒక్కసారిగా కుప్పకూలింది. తండ్రి కూడా మృతుల్లో ఉన్నాడని తెలిసి షాక్‌ నుంచి కోలుకోలేకపోయింది.

గుంతకల్లు/తాడిపత్రి/గార్లదిన్నె: గుంతకల్లు పట్టణానికి చెందిన శివప్రసాద్‌ (60) స్థానికంగా ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు కాగా.. బీటెక్‌ చేసిన పెద్ద అమ్మాయి ఉషారాణిని శ్రీకాళహస్తికి చెందిన నరేష్‌తో వివాహం చేయాలని నిశ్చయించారు. సోమవారం ఉదయం తిరుపతిలో పెళ్లి. దీంతో వారం రోజులుగా ఇళ్లంతా పెళ్లి సందడితో కళకళలాడింది. శనివారం రోజునే ఉషారాణిని పెళ్లికుమార్తెను చేశారు. ఆదివారం బంధువులతో కలిసి తిరుపతి బయలుదేరారు. అయితేశివప్రసాద్‌ భార్య పద్మావతితోపాటు వారి చిన్నమ్మాయి శివరంజని, పెళ్లికుమార్తె ఉషారాణి మరి కొందరు బంధువులతో రైలులో తిరుపతికి బయలుదేరారు. శివప్రసాద్‌ మాత్రం తన బంధువులు తొమ్మిది మందితో కలిసి స్థానికంగా అద్దెకు తీసుకున్న తుఫాన్‌ వాహనం(ఏపీ 04 టీటీ 9266) లో తిరుపతికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం ప్రకాష్‌నగర్‌ కాలనీ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ (ఆర్‌జే 32 జీబీ 9419) ఢీ కొంది. ఈ ఘటనలో శివప్రసాద్‌తోపాటు తాడిపత్రి మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రంగమ్మ(40) ఆమె కుమార్తె సరస్వతి (18), శివన్న (50), ఆయన భార్య సుజాత (48), గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(54), ఆమె మనుమరాలు గాయత్రీ(10) మృత్యువాతపడ్డారు. 

కొప్పలకొండ గ్రామంలో విషాదఛాయలు
గార్లదిన్నె: కడపలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని కొప్పలకొండ గ్రామానికి చెందిన పోస్టుమాన్‌ గోవింద రాజులు భార్య భాగ్యలక్ష్మి(54), మనుమరాలు గాయత్రీ(10) మృత్యువాత పడడంతో కొప్పలకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ సమీప బంధువుల పెళ్లి తిరుమలలో ఉండడంతో ఆదివారం ఉదయం పోస్టుమాన్‌ గోవిందరాజులు, ఆయన భాగ్యలక్ష్మి, మనమరాలు గాయత్రీ ముగ్గురూ గుంతకల్లుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరుపతి బయలుదేరగా మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో భాగ్యలక్ష్మి, గాయత్రి మృత్యువాత పడ్డారు. విషయం తెలియగానే కొప్పలకొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భాగ్యలక్ష్మి భర్త గోవిందరాజులు పోస్టుమెన్‌ కావడం.. గ్రామం మొత్తానికి ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. 

రెక్కాడితేగానీ     డొక్కాడని కుటుంబం  
తాడిపత్రి: వెంకటాంపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ, రంగమ్మలు(40) వ్యవసాయ కూలీలు. వ్యవసాయ పనులు లేనప్పుడు సమీపంలోని కొండగట్టుల్లో కంకర రాళ్లు కొట్టి జీవనం సాగించే వారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె భారతీ వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. రెండో కుమార్తె సరస్వతీ (18) తాడిపత్రిలోని ఓ ప్రైవేటు కళశాలలో ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసుకుంది, ఆదినారాయణ భార్య రంగమ్మ , కూతురు సరస్వతిలు ఆదివారం ఉదయం వారి బంధువులకు చెందిన వివాహ నిమిత్తం తుఫాన్‌ వాహనంలో బయలు దేరారు. పుల్లంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికూతుళ్లు ఇద్దరు మృతి చెందారు.

బతుకుదెరువు కోసం సొంత ఊరును వదిలొచ్చి
శివన్న(50), అతని భార్య సుజాత (48)లు బతుకు తెరువుకోసం యాడికి నుంచి తాడిపత్రి మండలం వెంకటాంపల్లి గ్రామానికి వచ్చారు. గ్రామంలో ఓ చిల్ల దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే వారు. వీరికి సంతానం లేకపోవడంతో సమీప బంధువులకు చెందిన సాయి అనే బాలున్ని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మృత్యువాత పడడంతో వెంకటాంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

మరిన్ని వార్తలు