మృత్యు శకటం

23 Aug, 2018 12:27 IST|Sakshi
మృతి చెందిన వసంత్‌  మృతి చెందిన రూథమ్మ

కడప అర్బన్‌ : కడప నగర శివారులో ఆపి ఉన్న బైక్‌ను, కారు దూసుకొచ్చి ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం రిమ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కడపలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన రూథమ్మ(47) భర్త సుధాకర్‌ రైల్వే ఐడబ్ల్యూలో కార్పెంటర్‌ పని చేస్తూ పదవీ విరమణ పొందారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రూథమ్మ చెల్లెలు కుమార్తె భార్గవి కడప నగర శివారులోని పీఎస్‌ నగర్‌లో నివసిస్తోంది. రూథమ్మ తమ్ముడు వసంత్‌(40) తన స్వగ్రామం పెద్దముడియం నుంచి ప్రకాష్‌నగర్‌లోని తన అక్క దగ్గరికి వచ్చాడు.

ఈ క్రమంలో రూథమ్మ, వసంత్‌ తమ ద్విచక్రవాహనంలో భార్గవిని చూసేందుకు ప్రధాన రహదారిపైకి బుధవారం సాయంత్రం వచ్చారు. పీఎస్‌నగర్‌కు ఎదురుగా ప్రధాన రహదారి చివర ఎడమవైపున తమ ద్విచక్రవాహనాన్ని నిలిపి అడ్రస్‌ కనుగొనేందుకు నిలుచొని వుండగా.. వెనుక వైపు నుంచి కారు (ఏపీ04 బీవీ 3012) వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో వారు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 108 వాహనం వారు వచ్చినప్పటికీ అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. కారులో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి వున్నట్లు తెలుస్తోంది. వారిలో కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
 
సంఘటన స్థలం పరిశీలన 
సంఘటన స్థలానికి కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా తమ సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు, ప్రత్యక్షంగా చూసిన వారిని అడిగి తెలుసుకున్నారు. రిమ్స్‌ సీఐ ఆర్‌ పురుషోత్తం రాజు అంతకు ముందుగానే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను తమ సిబ్బంది సహాయంతో రిమ్స్‌ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు