రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి : ఐదుగురికి గాయాలు 

23 Sep, 2019 08:44 IST|Sakshi

పెదకాకాని హైవేపై రోడ్డు ప్రమాదం.. బైక్‌ను కారు వెనక నుంచి ఢీకొనడంతో ఇద్దరు అచేతనంగా రోడ్డుపై పడి ఉన్నారు. ఇద్దరూ రక్తపు మడుగుల్లో తడిచిపోయారు. అటుగా వెళుతున్న వారు 108కు కాల్‌ చేశారు. ఇంతలో రయ్యిమంటూ దూసుకెళుతున్న ఒక కారు అక్కడ సడన్‌గా ఆగింది. వెంటనే కారులో నుంచి ఓ మహిళ కిందకు దిగారు. గాయాలతో పడి ఉన్న వారి వద్దకు వేగంగా వెళ్లారు. పల్స్‌ చెక్‌ చేశారు. అప్పటికే ఒకరు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంతలో అటు వైపు వెళుతున్న అమ్మ చారిటబుల్‌ సంస్థ అంబులెన్స్‌ను ఆపి మరో వ్యక్తిని అందులో ఎక్కించారు. ఇంజెక్షన్‌ చేసి.. ప్రాథమిక వైద్యం అందించారు.  వెంటనే గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్య సేవలందించింది స్వతహాగా వైద్యురాలైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రోడ్డుపై క్షతగాత్రులను చూసిన వెంటనే మనసు చలించిన ఆమె వెంటనే వైద్య సేవలందించి మానవత్వాన్ని చాటుకున్నారు.  

సాక్షి, గుంటూరు(పొన్నూరు) : పెదకాకాని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన  ఆదివారం చోటు చేసుకుంది. గుంటూరు ఆర్‌టీసీ కాలనీకి చెందిన కొవ్వూరు చంద్రశేఖరరావు(63) లారీడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ప్రతి వారం ఆలయానికి వెళ్లే అలవాటు ఉన్న చంద్రశేఖరరావు ఆదివారం తన మిత్రుడు ఆటో నగర్‌ లారీ మెకానిక్‌ లడ్డూ మేస్త్రి, మస్తాన్‌వలిని వెంట పెట్టుకొని బైక్‌పై మంగళగిరి సమీపంలోని నవులూరు పుట్టవద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో పెదకాకాని సమీపంలోకి వచ్చే సరికి  వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొమ్మూరు చంద్రశేఖరరావు అలియాస్‌ చందు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు తలకు హెల్మెట్‌ పెట్టుకున్నా కారు ఢీ కొనటంతో  ముక్కలైంది.  బైక్‌పై ఉన్న మస్తాన్‌వలికి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించారు. 

వైద్య సేవలు అందించిన ఎమ్మెల్యే  శ్రీదేవి
పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి ఆగి క్షతగాత్రులకు వైద్య సేవలు అందించారు. చంద్రశేఖరరావును పరీక్షించిన ఆమె పల్స్‌ ఆగినట్లు గుర్తించారు. తీవ్ర గాయాలైన ఎస్‌కే మస్తాన్‌వలికి ప్రాథమిక వైద్య చికిత్స చేశారు. 

పాలువాయి జంక్షన్‌లో వ్యక్తి ..
మండలంలోని పాలువాయి జంక్షన్‌–పాలువాయిగేటు గ్రామాల మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పశర్లపాడు గ్రామానికి చెందిన వట్టికుంట రామయ్య(40) నాపరాయి వ్యాపార పనుల కోసం మాచర్లకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. దాచేపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు వెళ్తున్న కారు వేగంగా వచ్చి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రామయ్య ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది. దీంతో రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రామయ్య గ్రామంలో వ్యవసాయంతో పాటు నాపరాయి వ్యాపారం చేస్తుండేవాడు. ఆయనకు భార్య పద్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. రామయ్య తండ్రి ముసలయ్య పశర్లపాడు గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు. సంఘటనా స్థలానికి  చేరుకున్న ఎస్‌ఐ కుంచాల సుమన్‌ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. 

చేబ్రోలులో నలుగురికి గాయాలు
చేబ్రోలు: ప్రమాదవశాత్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనటంతో నలుగురికి గాయాలైన సంఘటన  చేబ్రోలులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.  పొన్నూరు రూరల్‌ మండలం బ్రాహ్మణకోడూరు ప్రాంతానికి చెందిన మెకానిక్‌ ఎస్‌కే మహబూబ్‌ జానీ మరో వ్యక్తి కలిసి ద్విచక్ర వాహనంపై చేబ్రోలు వైపు బయలు దేరారు. మార్గ మధ్యలో చేబ్రోలు సినిమా హాలు సమీపంలో మామిళ్లపల్లి ప్రాంతానికి చెందిన మరో ద్విచక్ర వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఈయన పరిస్థితి విషమంగా ఉంది. గన్నవరం సమీపంలోని కండ్రిక ప్రాంతానికి చెందిన భవనం సత్యనారాయణ, భవనం లక్ష్మీనారాయణలు మామిళ్లపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం సెలవు కావటంతో చేబ్రోలుకు బయలు దేరారు.  బి వేణుకు గాయాలయ్యాయి. వీరి నలుగురిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా