భయం భయంగా ప్రయాణం

28 Aug, 2018 12:38 IST|Sakshi

ప్రమాదాలకు నిలయంగా పేరేచర్ల–కొండమోడు రహదారి

50 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారి  విస్తరణకు హామీ

రూ.512 కోట్ల రహదారి  నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు

రోడ్డు విస్తరణలో జాప్యంపై పట్టించుకోని పాలకులు, అధికారులు

సత్తెనపల్లి: రోడ్లు ప్రగతికి మార్గదర్శకాలు. ప్రజా రవాణా వ్యవస్థ సాఫీగా, సురక్షితంగా సాగిన చోట అభివృద్ధి దానంతట అదే పరుగులు పెడుతోంది. మౌలిక సదుపాయాల్లో ప్రధాన అంశంగా ఉన్న రోడ్లు సమకూరితేనే ఏ గ్రామమైనా, వ్యాపారమైనా అభివృద్ధి చెందేది. కాని ఏళ్లు గడిచినా ఈ సౌకర్యం కేవలం రాజకీయ అంశంగానో, ప్రకటన అంశం గానో మారిపోతే మాత్రం జనం పాట్లు పడాల్సిందే. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం పేరేచర్ల– కొండమోడు మార్గం. ఈ మార్గం గడిచిన నాలుగేళ్లుగా ‘‘నాలుగు వరుసల రోడ్డుగా మారుస్తాం.. 50 కిలోమీటర్లు పొడవున 22.5 మీటర్లు వెడల్పుతో తీర్చిదిద్దుతాం.. రాజధాని ప్రాంతంలో కీలకమైన రహదారిగా రూపొందిస్తాం’’అంటూ అధికారులు, పాలకులు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2014 ఎన్నికల అనంతరం ప్రస్తుత పాలకులు ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తామని ఎంచుకున్నారు. ఈ మార్గం ప్రధాన మార్గాలుగా కలుపుతూ మార్కింగ్‌లు కూడా చేశారు. అయిన అది కార్యరూపం దాల్చలేదు. ఈ మార్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఇదీ మార్గం ప్రాధాన్యం : గుంటూరు నుంచి హైదరాబాద్‌ మార్గంలో పేరేచర్ల – కొండమోడు వరకు నాలుగు వరుసలుగా రహదారి విస్తరణకు గతంలో సర్వేలు చేపట్టారు. అద్దంకి – నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈ మార్గం రహదారి ప్రమాదాలు, ప్రయాణ సమయం, ఇంధనం ఆదా వంటి లక్ష్యాలతో విస్తరణ చేపట్టేందుకు రహదారుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు చేసి టెండర్లు కూడా పిలిచారు. అయినప్పటికీ టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. పనులు దక్కించుకునే కాంట్రాక్టర్‌ పెద్ద మొత్తంలో పాలకులకు కమీషన్ల రూపేణ చెల్లించాల్సి ఉంటుందనే ప్రచారం ఉండడంతో ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాలేదు. ఈ మార్గంలో నిత్యం వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. మార్జిన్‌లు సైతం సక్రమంగా లేకపోవడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. మొత్తం 50 కిలోమీటర్లు పొడవున నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.512కోట్లు వెచ్చించి బీవోటి పద్ధతిలో రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎన్ని పర్యాయాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. ఈ రహదారి విస్తరణకు కనీసం ఆరుగురు కాంట్రాక్టర్లు పోటీ పడితే అర్హత సాధించిన వారికి పనులు కేటాయిస్తారు. ఈ రహదారి విస్తరణతోపాటు పేరేచర్ల నుంచి కొండమోడు మార్గంలో మేడికొండూరు నాలుగు నుంచి ఐదు కిలో మీటర్లు బైపాస్‌ నిర్మాణం, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్లు బైపాస్‌ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుత రహదారి ఏడు నుంచి 10 మీటర్ల వెడల్పుతో రహదారి ఉండడంతో వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది.

ప్రారంభం కాని భూసేకరణ : పేరేచర్ల నుంచి కొండమోడు మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణ కీలకం. విస్తరణలో ఏయే ప్రాంతంలో ఎంత భూమి అవసరమో రహదారుల అభివృద్ధి సంస్థ గుర్తించింది. సేకరించాల్సిన భూమిలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్‌ భూమి, అసైన్డ్, పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి వివరాలను రెవెన్యూ యంత్రంగానికి అందించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రంగం పరిశీలించి ఏ రైతు భూమి రహదారి విస్తరణకు ఎంత అవసరం? నిబంధనల ప్రకారం ఎంత పరిహారం లభిస్తోంది, తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలి. కాని ఇంత వరకు ఆ ప్రక్రియ జరగలేదు. రెండు వైపుల డివైడర్లు, మార్జిన్‌లు కలుపుకొని 22.5 మీటర్లు వెడల్పుతో రహదారి నాలుగు వరుసలుగా విస్తరించాల్సి ఉంది.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నపాలకులు, అధికారులు : ఈ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారినప్పటికీ పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. రహదారి ఇరుకుగా ఉండడంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్న తీరుపై ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ప్రస్తావించినప్పటికీ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా రహదారి విస్తరణ చేపట్టి వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు