ప్రాణాలు తీసిన అతివేగం

16 Jul, 2018 11:00 IST|Sakshi
ఘటనాస్థలంలో మృతదేహాలు

సారంగాపూర్‌(జగిత్యాల): అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం పోతారం శివారులోని గణేశ్‌పల్లిలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదంలో మండలంలోని  రేచపల్లి గ్రామం కొత్తపల్లి తండాలో నివాసం ఉంటున్న మంగ శేఖర్‌(28), మైనవేని వెంకటే ష్‌(19) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శేఖర్, వెంకటేశ్‌ సెంట్రింగ్‌ పనులు నిర్వహిస్తారు. ఇటీవల తుంగూరులో ఓ భవనానికి స్లాబ్‌ వేశారు. యజమాని వద్ద డబ్బులు రావాల్సి ఉండడంతో ఇద్దరు కలిసి తూంగూరుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన శేఖర్‌ తమ్ముడు మంగ సుధాకర్, కొత్తపల్లి రాజశేఖర్, దూస గణేశ్‌ మరో బైక్‌పై వెళ్లారు. యజమాని వద్ద డబ్బులు తీసుకుని కొత్తపల్లి తండాకు బయల్దేరారు.ఈ క్రమంలో రెండు వాహనాలను అతివేగంగా నడిపారు.

బీర్‌పూర్‌ఘాట్‌ దిగి గణేశ్‌పల్లి సవిల్‌సప్లై గోదాం సమీపంలోని మూలమలుపు వద్ద  శేఖర్, వెంకటేశ్‌ వెళ్తున్న బైక్‌ వేగంగా ఉండడంతో అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడ్డారు. తలలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరి వాహనాన్ని అనుసరిస్తున్న మరో ద్విచక్రవాహనంపై ఉన్న సుధాకర్, రాజశేఖర్, గణేష్‌ సైతం ముందున్న బైక్‌ను, చెట్టును ఢీకొట్టి కిందపడడంతో వీరికి స్వల్పగాయాలు అయ్యాయి. ఘటనాస్థలాన్ని ఎస్సై రాజ య్య పరిశీలించారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అతివేగం.. అజాగ్రత్త.. 
రెండు వాహనాలు బీర్‌పూర్‌ నుంచే అతివేగంగా వస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఒకరికన్నా మరొకరు పోటీతో వాహనాలు నడిపినట్లు చెబుతున్నారు.ప్రమాద స్థలానికి 500 మీటర్ల దూరంలో బ్రేక్‌వేసినా.. టైర్లు నేలకు రాకుతూ.. చెట్టును బలంగా ఢీకొట్టడంతో బెరడు ఊడిపోయిందంటే ప్రమాద స్థితిని అర్థం చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు.

ఉపాధికోసం వచ్చి.. 
మంగ శేఖర్‌ది కుమురంభీం జిల్లా జిల్లా తిర్యాణి గ్రామం. సెంట్రింగ్‌ పనుల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం భార్యాపిల్లలతో వచ్చి రేచపల్లిలో స్థిరపడ్డారు. ఇటీవలే తన తమ్ముడు సుధాకర్‌ సైతం పనుల నిమిత్తం వచ్చాడు. శేఖర్‌కు భార్య రూప, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
బైక్‌ అదుపుతప్పి యువకుడు.. 
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేటలో అదివారం రాత్రి పెద్దింటి నరేష్‌(30) బైక్‌ అదుపుతప్పి దుర్మరణం చెందాడు. దగ్గులమ్మగుడి ప్రాంతనికి చెందిన నరేష్‌ తన సోదరి రాజేశ్వరిని పట్టణంలోని పురాణిపేటలో దింపేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా... బైక్‌ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్‌ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు పిల్లలున్నారు.

మరిన్ని వార్తలు