స్పీడ్‌ కిల్స్‌.. 

22 Dec, 2018 09:05 IST|Sakshi
రవి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు తీవ్రంగా గాయపడిన వాసం మధు 

అతివేగం ప్రమాదకరం.. నిదానమే ప్రధానమని ప్రభుత్వ అధికారులు, పోలీసులు ప్రచారం చేస్తున్నా వాటిని పట్టించుకునే నాథుడే లేడు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదు.. అని పలు ఆటోలు, బస్సులకు స్టిక్కర్లు అతికి ఉంచడం చూస్తాం.. కాని పాటించం.. ముఖ్యంగా బైక్‌పై వెళ్లేవారు ప్రమాదాలకు గురికావడం గమనార్హం.  శుక్రవారం ఒక్కరోజే పలు చోట్ల బైక్‌ ప్రమాదాలు జరిగాయి. 

కన్నాయిగూడెం: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారి, మరో ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన కన్నాయిగూడెం మండలం గుర్రేవుల మలుపు వద్ద శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరునాగారం మండలం రోహీర్‌ గ్రామానికి చెందిన ఆముదాల రమేష్‌ గత ఆరుమాసాల నుంచి ముప్పనపల్లి గ్రామంలో తైవాన్‌ పంపులు రిపేర్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇదే క్రమలో గూర్రేవుల గ్రామానికి బంధువుల ఇంటికి çపని మీద వెళ్లి బైక్‌పై వస్తున్నాడు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ అతి వేగంగా బైక్‌పై వస్తూ ఎదురుగా వచ్చే కావిరి రవి(28) బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. జనగం వెంకటయ్య, ఈశ్వరమ్మలకు స్వల్పగాయాలయ్యాయి. ఆముదాల రమేష్‌కు తలకు , కాలుకు తీవ్ర గాయాలు కాగ వెంటనే ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు రవి బుట్టాయిగూడెంలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రవి బైక్‌పై వెళ్తున్న వెంకటయ్య, ఈశ్వరమ్మలు గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని సీఐ సత్యనారాయణ పరిశీలించారు.

బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు
మహాముత్తారం: మండలంలోని యామన్‌పల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మహాముత్తారం ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం కాళేశ్వరం గ్రామానికి చెందిన కూరపాటి మహేష్‌ అనే వ్యక్తి మేడారం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో బోర్లగూడెం గ్రామానికి చెందిన వాసం మధు అనే వ్యక్తి కాటారం నుంచి బోర్లగూడెం వెళ్తుండగా మార్గమద్యలోని యామన్‌పల్లి చెరువు సమీపంలోని ప్రధాన రహదారిలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఒకదానికి ఒకటి ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో మహాముత్తారం ఎస్సై రాము సంఘటనా స్థలానికి చేరుకొని ప్రైవేట్‌ వాహనంలో మహాదేవపూర్‌ ఆస్పత్రికి తరలించారు. 

బైక్‌ను  ఢీకొట్టిన లారీ..
కురవి:బైక్‌ను గుర్తు తెలియని లారీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన కురవి మండలంలోని మోద్గులగూడెం–తాళ్లసంకీస గ్రామాల నడుమ ఖమ్మం ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. డోర్నకల్‌ మండలంలోని మన్నెగూడెం శివారు సాధు తండాకు చెందిన తునగర్‌ ఉపేందర్, తునగర్‌ బావ్‌సింగ్‌లు మహబూబాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై కురవి మీదుగా మన్నెగూడెం వెళ్తున్నారు.

మానుకోట నుంచి వస్తున్నలారీ ముందు వెళ్తున్న బైక్‌ను మోద్గులగూడెం–తాళ్లసంకీస గ్రామాల నడుమ రహదారిపై ఢీకొట్టింది. ఈ ఘటనలో తునగర్‌ ఉపేందర్, బావ్‌సింగ్‌లకు తలలకు బలమైన గాయాలు కావడం జరిగింది. రక్తస్రావం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న జనం 108కి సమాచారం అందజేశారు. హుటాహుటిన తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైక్‌ను ఢీకొట్టిన లారీ వేగంగా వెళ్లిపోవడంతో లారీ దొరకలేదు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు