93 నిమిషాలకో ప్రాణం!

27 Aug, 2019 02:16 IST|Sakshi

ఈ ఏడాది 3,833 మంది దుర్మరణం.. గ్రేటర్‌లోనే 1032 మంది

రాష్ట్రవ్యాప్తంగా రక్తమోడుతున్న రోడ్లు

సాక్షి, హైదరాబాద్‌: అతి వేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2015లో దేశవ్యాప్తంగా జరిపిన ఓ సర్వే ప్రకారం.. ఆ ఏడాది 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. దీని ప్రకారం రాష్ట్రంలో సగటున 6వేల మందికిపైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికి 3,833 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 13,588 మంది గాయపడ్డారు. రాష్ట్రం లో రోజుకు 18మంది, నెలకు 479 మంది ప్రాణాలు కోల్పోతుండగా.. రోజుకు 64మంది  గాయపడుతున్నారు. ప్రతీ 93 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు.  

మరణాల్లో సైబరాబాద్‌ టాప్‌:
రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ కమిషనరేట్‌ పరిధిలో 467 మంది మరణించారు. రాచకొండ(427), సంగారెడ్డి (259), వరంగల్‌(197), నల్లగొండ (188), ఖమ్మం(166),సిద్దిపేట(165) తర్వాతి స్థానా ల్లో నిలిచాయి. ఇక ములుగు, నారాయణపేట్‌ జిల్లాలు చెరో 3 మరణాలతో అత్యల్ప ప్రమాద మృతులు నమోదైన జిల్లాలుగా నిలిచాయి. వనపర్తి (46), సిరిసిల్ల(41), కుమరంభీం (34) జిల్లాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలోనే రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో కలిపి 1,032 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్‌ తరువాత సంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, ఖమ్మం తదితర ప్రాంతాల్లోనే నమోదవడం గమనార్హం. 


మరిన్ని వార్తలు