అతని కన్నుపడిందా.. గోవిందా

13 Jan, 2020 09:38 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ కేఏ స్వామి, చిత్రంలో స్వాదీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

చోరీల్లో ఆరితేరిన ఘనుడు

ఏలూరు హోంకు తరలింపు

సాక్షి, నిడదవోలు: ఏ ఇంటిపైనైనా ఆ బాలుడి కన్ను పడిందా.. ఇక గోవిందా.. ఆ ఇంటికి కన్నం పడాల్సిందే.. ఇల్లు గుల్లవ్వాల్సిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగిలించడంలో అతను ఘనాపాటి. మోటార్‌ సైకిళ్ళు కూడా అపహరించడం అతనికి వెన్నతోపెట్టిన విద్య. మూడేళ్ల నుంచి చోరీలకు పాల్పడుతున్న ఇతనిని గతంలో పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ బాలుర సంరక్షణ హోంలో పెట్టారు. ఇటీవలే జామీనుపై విడుదలైన బాలుడు మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టణంలోని పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో నిడదవోలు సీఐ కేఏ స్వామి ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చాగల్లు షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఆదివారం బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కొవ్వూరు పట్టణానికి చెందిన ఈ బాలుడు చాగల్లు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మీనా నగరంలో ఇంటి తాళాలు పగలుకొట్టి దొంగతనం చేశాడు. ఏలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్టీఆర్‌ నగర్‌లోనూ చోరీకి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం, భద్రాది జిల్లా కొత్తగూడెం, చర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఇతనిపై కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌ పురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ చోరీకి పాల్పడ్డాడు.

పెరవలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మోటార్‌ సైకిల్‌ చోరీ చేశాడు. కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పర్యవేక్షణలో నిడదవోలు సీఐ కేఏ స్వామి ఆధ్వర్యంలో బాలుడిని అదుపులోకి తీసుకుని మళ్లీ ఏలూరు ప్రభుత్వ బాలుర సంరక్షణ హోంకు తరలించారు. బాలుడి వద్ద నుంచి 112 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, టీవీ, మోటార్‌సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5 లక్షల వరకూ ఉంటుందని సీఐ కేఏ స్వామి తెలిపారు. విలేకరుల సమావేశంలో నిడదవోలు పట్టణ ఎస్సై కె.ప్రసాద్, చాగల్లు ఎస్సై జి.జె.విష్ణువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు