-

వరాల మాట సరే.. చోరీల సంగతేంటి స్వామీ

26 Sep, 2019 12:33 IST|Sakshi
అన్నవరం దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం వద్ద నిలిపి ఉన్న కార్లు, బైకులు

అన్నవరం ఆలయంలో దొంగతనాల జోరు

ఆదివారం నాటి ఘటనతో హడలిపోతున్న భక్తులు

పార్కింగ్‌ స్థలంలో సీసీ కెమెరా లేక లభ్యం కాని దొంగ ఆచూకీ

అన్ని చోట్లా సీసీ కెమెరాలు అమర్చాలన్న ఈఓ ఆదేశాలు బేఖాతరు

ఇకపై ఇటువంటి సంఘటన జరగకుండా గట్టి చర్యలు: ఈఓ త్రినాథరావు

తూర్పుగోదావరి ,అన్నవరం (ప్రత్తిపాడు): ఏ దిక్కు లేనివాళ్లకు దేవుడే దిక్కంటారు. మరి ఆ దేవుడు సన్నిధిలోనే దొంగతనాలు జోరుగా జరుగుతుంటే ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ప్రస్తుతం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ కోర్కెలు స్వామికి చెప్పుకుందామని వస్తున్న వారు.. మా కార్ల అద్దాలు ఎవరూ పగులకొట్టకుండా.. మా పర్సులు, ఆభరణాలు ఎవరూ అపహరించకుండా చూడు స్వామీ అని వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆదివారం రత్నగిరిపై కారు అద్దాలు పగలగొట్టి రూ.20 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు పట్టుకుపోయిన విషయం తెలిసిందే.దీంతో సోమవారం దేవస్థానానికి వచ్చిన భక్తులు తమ కార్లకు తామే కాపలా కాసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఆ కారు నిలిపి ఉంచిన ప్రదేశంలో సీసీ కెమెరా లేకపోవడంతో దొంగ ఆచూకీ దొరకలేదని పోలీసులు తెలిపారు.

కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఈఓ ఆదేశించినా..
దేవస్థానంలో తరచూ చోరీలు జరుగుతున్న విషయాన్ని, కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని వివరిస్తూ ఈ నెల ఐదో తేదీన  ‘సత్తెన్న.. భద్రతేదీ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన దేవస్థానం ఈఓ త్రినాథరావు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేవస్థానం సిబ్బందిని ఆదేశించి అన్ని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. అయితే ఈఓ ముందు తల ఊపిన సంబంధిత సెక్షన్‌ అధికారులు కొన్ని చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు అమర్చి చేతులు దులుపుకొన్నారు. వీఐపీలు బస చేసే వినాయక అతిథిగృహం వద్ద, ఆ పరిసరాల్లో భక్తులు తమ కార్లు నిలిపి ఉంచే పార్కింగ్‌ స్థలంలో కాని సీసీ కెమెరాలు అమర్చలేదు. ఇదే అదనుగా భావించిన దొంగ ఆదివారం తణుకుకు చెందిన కె.శ్రీనివాస్‌ కారు అద్దాలు పగలగొట్టి రూ.20 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు అపహరించారు. అంతే కాదు సీసీ కెమెరాలు లేని మార్గాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ దొంగ దేవస్థానంలోని అన్ని ప్రాంతాలు తెలిసిన వాడడం వల్లే అలా పరారవ్వగలిగాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చోరీ జరిగినందుకు కొంత, కారు అద్దాలు పగలుకొట్టినందున కొత్త అద్దం వేయడానికి మరో రూ.40 వేల వరకు ఖర్చవుతుందని బాధితుడు శ్రీనివాస్‌ వాపోయారు.

చోరీలు అరికట్టాలంటే..
రత్నగిరిపై చోరీలకు అడ్డుకట్ట వేయాలంటే.. దేవస్థానంలో పలు నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంది.
కొండ దిగువ నుంచి కొండ మీద వరకు ప్రతి పాయింట్‌ సీసీ కెమెరాలో కవర్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
దేవస్థానంలో భక్తుల కార్లు నిలిపేచోట సెక్యూరిటీ సిబ్బంది ని ఎక్కువగా నియమించాలి. ఆ ప్రాంతాలలో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేయాలి. వీఐపీ కాటేజీల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలి. పోలీస్‌ అవుట్‌పోస్టు ఏర్పాటు చేయాలి. ఒక కానిస్టేబుల్‌ ప్రతి రెండు గంటలకు దేవస్థానంలో అన్ని పాయింట్లు చెక్‌ చేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్‌ చేయాలి.
దొంగతనం చేస్తూ పట్టుబడిన వారి ఫొటోలను దేవస్థానంలోని కీలక ప్రదేశాల్లో ప్రదర్శించి భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు సీసీ టీవీ లను పరిశీలించేందుకు సిబ్బందిని నియమించాలి.
ప్రధానంగా చోరీ సంఘటనలు జరిగినపుడు అక్కడ సిబ్బందిపై చర్యలు ఉండాలి.

దేవస్థానంలో భద్రతను కట్టుదిట్టం చేస్తాం: ఈఓ త్రినాథరావు
ఆదివారం జరిగిన చోరీ సంఘటన దురదృష్టకరం. దేవస్థానంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవని ‘సాక్షి’లో వార్త వచ్చినపుడు అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించా. కానీ ఆ కారు నిలిపినచోట సీసీ కెమెరాలు లేవని తెలిసింది. సోమవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా ఎక్కడా సీసీ కెమెరా కనిపించలేదు. అంత కీలకమైన చోట ఎందుకు సీసీ కెమెరా పెట్టలేదో వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాను. నాలుగు రోజుల్లో అన్ని చోట్ల కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాను. పోలీసులు గస్తీ తిరిగేలా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు ఉన్నతాధికారులతో మాట్లాడతాను.

మరిన్ని వార్తలు