దొంగలు బాబోయ్‌...దొంగలు..

27 Apr, 2019 12:50 IST|Sakshi

జిల్లా కేంద్రంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెరిగిన దొంగతనాలు

దొంగల ముఠా హల్‌చల్‌తో హడలిపోతున్న జనం

వారం వ్యవధిలో  సత్తెనపల్లిలోనే  ఎనిమిది చోరీలు

వరుస దొంగతనాలతో  హడలిపోతున్న ప్రజలు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా  పనేనని అనుమానిస్తున్న పోలీసులు

రాత్రి గస్తీలు సక్రమంగా  జరగకపోవడంతో   రెచ్చిపోతున్న దొంగలు

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను  వినియోగించుకోవాలంటున్న అర్బన్, రూరల్‌ ఎస్పీలు

సాక్షి, గుంటూరు:  జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు హడలిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని రాత్రి వేళల్లో దొంగలు తమ పనిని చక్కబెట్టుకుంటున్నారు. గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 రోజుల వ్యవధిలో వరుస దొంగతనాలు జరగడంతో పోలీసులు సైతం రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని  సత్తెనపల్లిలో వారం వ్యవధిలో ఎనిమిది చోట్ల దొంగతనాలు జరగడంతో ఆ ప్రాంత ప్రజలు  భయాందోళనలు చెందుతున్నారు.  వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. రాత్రి గస్తీలు సక్రమంగా జరగకపోవడం వల్లే కొన్ని ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా రూరల్, అర్బన్‌ ఎస్పీలు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌)ను వినియోగించుకోవాలని పలు మార్లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రజల్లో దీనిపై అవగాహన లేకపోవడంతో దీన్ని వినియోగించుకోలేకపోతున్నారు.  దీంతో ఊర్లకు వెళ్లి వచ్చేసరికి తమ విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు తెలుసుకుని లబోదిబో మంటున్నారు.  జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలు మామూలు దొంగల పనా, లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో తిరుగుతుందా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలిసింది. జిల్లాలో జరుగుతున్న దొంగతనాల తీరును పరిశీలిస్తే ఒక్కోటి ఒక్కో రకంగా ఉంది.  దీంతో ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. 

సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి శివారు గ్రామమైన వెన్నాదేవిలో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడిచేసి దోచుకున్న సంఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఇద్దరు యువకులు ఈ నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు.  నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నిందితులిద్దరూ సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన వారని, కొంతకాలంగా సత్తెనపల్లిలో నివసిస్తున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. నేరం జరిగిన తరువాత  పరిణామాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఈ కేసు కొలిక్కి రాకముందే సత్తెనపల్లి పట్టణంలో బుధవారం రాత్రి  రెండు గృహాల్లో చోరీలు జరగటం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. పట్టణంలోని వివేకానందనగర్‌లో నివసిస్తున్న పండ్ల వ్యాపారి కుంభా బుల్లయ్య బుధవారం రాత్రి డాబాపై నిద్రిస్తుండగా, గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20వేలు నగదు అపహరించుకు పోయారు.

అర్థరాత్రి 2 గంటల సమయంలో మున్నియ్య కిందకు రాగా, అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉండటం, బీరువా తలుపులు తీసి ఉండటంతో చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సమీపంలోని బీబీనగర్‌లో ట్రావెల్స్‌ నిర్వాహకుడు షేక్‌ అబ్దుల్‌ రఫీ బెడ్‌రూములో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50వేలు నగదు అపహరించి ఇంటి వెనుక నుంచి దుండగులు పరారయ్యారు. సత్తెనపల్లిలో వారం వ్యవధిలో ఎనిమిది దొంగతనాలు జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. గుంటూరు నగరంలో సైతం నెల వ్యవధిలో పలు చోరీ ఘటనలు జరగడంతో పోలీసులు రాత్రి గస్తీని పటిష్టం చేశారు. బుచ్చయ్యతోటలో గత నెల 22వ తేదీన ఓ గృహంలో రూ.2.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను  అపహరించారు. దొంగతనాలు జరిగిన గృహాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సిస్టంను ఉపయోగించుకోలేదని తెలుస్తోంది. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఉపయోగించుకుని ఉంటే దొంగతనం జరగకుండా నివారించడంతోపాటు, వారిని పట్టుకునే అవకాశం ఉండేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై ప్రజల్లో ఇంకా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే దీన్ని ఎవరూ వినియోగించడం లేదన్నది వాస్తవం.

మరిన్ని వార్తలు