పోలీసులకు చిక్కని దొంగలు సీసీ కెమెరాలకు చిక్కారు

23 Feb, 2019 17:41 IST|Sakshi

భువనేశ్వర్‌ : జయపురంలో దొంగతనాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.  రాత్రయితే వీలైన చోట్ల, అవకాశం ఉన్న చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు పట్టణంలో ఏదో  ఒక చోట దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు సమర్థంగా వ్యవహరించలేక పోతున్నారని పురప్రముఖులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులకు చిక్కని దొంగలు సీసీ కెమెరాలకు చిక్కుతున్నారు. జయపురంలోని మెయిన్‌ రోడ్డులో ఒక దుకాణంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. ఆ దొంగ దుకాణం షట్టర్‌ తెరిచేందుకు విశ్వ ప్రయత్నంచేస్తున్న చిత్రాలు సీసీ కెమెరా  ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆ దుకాణంలో చోరీయత్నం  విఫలమవడంతో ఆ దొంగలు ఆ సమీపలో గల పాన్‌ దుకాణంలో దొంగతనం చేసినట్లు ఆరోపణలున్నాయి. వెంటనే పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీ ఫుటేజీలో పట్టుబడిన వారిని  పోలీసులు ఇంకా పట్టుకోలేదు. పట్టణలోని ప్రధాన మార్గంలో గల దుకాణం షట్టర్‌ తెరిచేందుకు ప్రయత్నిస్తున్న దొంగల చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు పట్టణంలో దొంగతనాలు అరికట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నా  దొంగల ముఠా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేస్తూనే ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.  గురువారం రాత్రి షట్టర్‌ విరిచి దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన దొంగల జాడలేదు.  ఆ దొంగలు వెంటనే పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

పోలీసులకు ఫిర్యాదు చేయని బాధితులు
వాస్తవంగా జయపురం పట్టణంలో ప్రతి రోజు  పలుచోట్ల చిన్న, పెద్ద దొంగతనాలు జరుగుతున్నా అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని తెలుస్తోంది. పోయిన వస్తువులు ఎలాగూ దొరకవు.  ఫిర్యాదులు చేసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరగడం ఎందుకన్న అభిప్రాయం కొంతమందిలో ఉందని, ఒక వేళ ఫిర్యాదు చేస్తే వారు పోలీసులకు చిక్కితే  పోయిన వస్తులు డబ్బు గాని తిరిగి వస్తాయనన్న నమ్మకం లేక బాధితులు  ఫిర్యాదులు చేయడం లేదని అంటున్నారు. పట్టణంలో జరుగుతున్న  దొంగతనాలకు కారకులు ఎవరన్నదానిపై పలు  అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.

దొంగతనాలు చేసిన వారిలో ఎక్కువగా స్థానికులు కాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు దొంగతనాలకు పాల్పడుతున్నారని   ప్రజలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారాలు చేసేందుకు, ఇతరత్రా పనుల మీద వస్తున్న కొంతమందికి పట్టణంలోని దొంగతనాల్లో ఏమైనా ప్రమేయం ఉందా? అన్న అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. షట్టర్‌ తెరిచేందుకు ప్రయత్నిస్తున్న దొంగ సీసీ ఫుటేజీలో స్థానికుడిలా లేడని, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిలా ఉన్నాడన్న అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు, పోలీసులు ఈ విషయంపై దృష్టి  కేంద్రీకరించి వాస్తవాలను వెలికితీయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 

>
మరిన్ని వార్తలు