తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

4 Aug, 2019 15:05 IST|Sakshi

మథుర: దొంగల బారి నుంచి బ్యాగును కాపాడుకునే క్రమంలో తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన మీనా అనే మహిళ తన కూతురు మనీషాను ఇంజనీరింగ్‌ ప్రవేశపరీక్షకు ప్రిపేర్‌చేసే నిమిత్తం కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించడానికి రాజస్థాన్‌లోని కోటకు బయలుదేరింది. తోడుగా ఉంటాడని కొడుకు ఆకాశ్‌ను కూడా వెంటబెట్టుకుని నిజాముద్దీన్‌ - తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కింది. ప్రయాణం సాఫీగా సాగిపోతున్న సమయంలో అజయ్‌ రైల్వేస్టేషన్ వద్ద కొంతమంది దుండగులు వచ్చి మనీషా దగ్గరున్న బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించారు. 

బ్యాగులో కూతురి హాస్టల్‌కు సంబంధించిన డబ్బు, చెక్కులు, ఇతర విలువైన వస్తువులు ఉండటంతో తల్లీకూతుళ్లు ప్రతిఘటించారు. ఎలాగైనా బ్యాగును కొట్టేయాలన్న దుర్బుద్ధితో దుండగులు వారిద్దరినీ రైలు నుంచి తోసేశారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో షాక్‌కు గురైన ఆకాశ్‌ వెంటనే వెళ్లి చైన్‌ను లాగగా, అప్పటికే రైలు వృందబాన్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులకు సమాచారమివ్వగా సిబ్బంది సంఘటనా స్థలానికి అంబులెన్స్‌ను పంపించారు. కాగా అంబులెన్స్‌ చేరుకునే సమయానికే వారిద్దరూ విగతజీవులుగా మారారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా