దొంగలకు ఆ చిన్న విషయం కూడా తెలీదు..

11 Nov, 2019 14:15 IST|Sakshi
సీసీటీవీ పుటేజీలో రికార్డైన ఓ దృశ్యం

న్యూఢిల్లీ: దొంగల ముందుజాగ్రత్త మొదటికే మోసం తెచ్చింది. సీసీటీవీ అనుకుని దొంగలు సెటప్‌ బాక్స్‌ ఎత్తుకెళ్లిన ఘటన ఢిల్లీలోని బేగంపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. పక్కా ప్లాన్‌తో నలుగురు దొంగలు శనివారం మిట్టమధ్యాహ్నం ఓ నగల దుకాణంలో చొరబడ్డారు. ముందుగా ఇద్దరు దొంగలు కస్టమర్లలా షాపులో అడుగుపెట్టారు. ఆ తర్వాత షాపులోకి ప్రవేశించిన మరో ఇద్దరు చేతిలో పిస్టోలు పట్టుకుని అక్కడి జనాలను బెదిరించారు. షాపు మొత్తం కలియతిరిగి నగలు, నగదు ఉన్నదంతా ఊడ్చుకుపోదామని చూశారు. అయితే షాపు యజమాని నగదు ఇవ్వడానికి ససేమీరా ఒప్పుకోలేదు. దీంతో ఓ దొంగ పిస్టోలుతో అతడ్ని బాది డబ్బు లాక్కునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ.1 లక్ష చేజిక్కించుకున్నారు. అయితే ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డవుతుందని భావించిన దొంగల ముఠాలోని ఓ వ్యక్తి సీసీ కెమెరా (డీవీఆర్‌)ను కూడా ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు.

దుకాణమంతా తిరిగి అతనికి కనిపించిన ఓ ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని తన బ్యాగులో వేసుకున్నాడు. అయితే అతను ఊహించినట్టుగా అది సీసీ కెమెరా రికార్డు చేసేది కాదు, సెటప్‌ బాక్స్‌. వచ్చిన పని ముగించుకుని హాయిగా దొంగలు అక్కడి నుంచి జారుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు హుటాహుటిన దుకాణానికి చేరుకున్నారు. అయితే సీసీ టీవీకి బదులుగా సెటప్‌ బాక్స్‌ ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసులకు పెద్దగా శ్రమ కల్పించలేదు. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌డీ మిశ్రా మాట్లాడుతూ.. సీసీటీవీ పుటేజీలో దొరికిన ఆధారాలతో అనుమానితులను గుర్తిస్తామన్నారు. చాలావరకు నగలు భద్రంగానే ఉన్నాయని, వాటిని తెరవడం దొంగలకు సాధ్యం కాలేదని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు