బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

1 Mar, 2018 08:56 IST|Sakshi

ప్రయాణికుడి జేబు కత్తిరించి.. రూ.22వేల నగదు చోరీ

బాధితుడు గుర్తించి కేకలు వేయడంతో చైన్‌ లాగిన దుండగులు

బోగీలోంచి దూకి పరుగులు..     వెంబడించిన రైల్వే పోలీసులు

రాళ్లు రువ్విన దొంగలు.. కాల్పులు జరిపిన పోలీసులు

ముళ్లపొదల్లోంచి తప్పించుకుని     పారిపోయిన దుండగులు

అనంతపురం టౌన్‌: బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. ప్రయాణికులు త్వరగా అప్రమత్తం కావడంతో దొంగలు చైన్‌లాగి పారిపోయారు. అనంతపురం మండలం తాటిచెర్ల రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బీదర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం తెల్లవారుజామున వస్తోంది. 3.40 గంటలకు తాటిచెర్ల రైల్వేస్టేషన్‌ దాటుతుందన్న సమయంలో రాయచోటికి చెందిన నారాయణ తన జేబులోని రూ.22వేల నగదు కనిపించకపోవడంతో ‘దొంగలు జేబును కత్తిరించేశారం’టూ గట్టిగా కేకలు వేశాడు. అంతవరకూ ప్రయాణికుల మధ్యే కలిసిపోయిన దొంగలు బోగిలోంచి చైన్‌లాగి ఒక్క ఉదుటున బయటకు పరుగులు తీశారు. స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వెంబడించారు. అయితే ట్రాక్‌పక్కనే ఉన్న ముళ్లపొదల్లో దాక్కున్న దొంగలు రాళ్లను పోలీసులపైకి రువ్వారు. పోలీసులు ఫైరింగ్‌ చేసినప్పటికీ ఆగకుండా మరోసారి రాళ్లు రువ్వి దుంగలు ఉడాయించారు. ఈ ఘటన నేపథ్యంలో బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ అరగంటపాటు అక్కడే నిలిచింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇది హైదరాబాద్‌ దొంగలపనే!
రైల్వే ప్రయాణికుడి వద్ద నగదు చోరీ చేసిన ఇద్దరు దొంగలు హిందీలో మాట్లాడారని, వారి యాసను బట్టి హైదరాబాద్‌కు చెందిన దొంగలుగా రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలకు పాల్పడతారన్నారు. 

తాటిచెర్ల రైల్వేస్టేషన్‌ను     పరిశీలించిన రైల్వే ఎస్పీ
బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో చోరీ జరిగినట్లు సమాచారం అందుకున్న రైల్వే ఎస్పీ సుబ్బారావు, డీఎస్పీ పీఎన్‌బాబుతోపాటు సీఐ తబ్రేజ్‌లు బుధవారం ఉదయం తాటిచెర్ల రైల్వే స్టేషన్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. రైలు ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   

బందూక్‌ ఉఠావ్‌.. గాడీ చలావ్‌
అనంతపురం సెంట్రల్‌: పోలీసులు కాల్పులు జరిపినా తప్పించుకుని పారిపోయిన దొంగలను పట్టుకునేం దుకు రైల్వే సీఐ వినోద్‌కుమార్‌మీనా హుటాహుటిన తన (ఏపీ29ఏఆర్‌7744) పల్సర్‌ బైక్‌లో అనంతపురం నుంచి తాటిచెర్ల రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. సోములదొడ్డి సమీపంలో రోడ్డుపక్కన ఇద్దరు వ్యక్తులు ఆనుమానాస్పదంగా నిలబడి ఉండడంతో వారి వివరాలు ఆరా తీసేందుకు బైక్‌ నిలిపారు. ఎవరు మీరు? ఇక్కడెందుకు ఉన్నారని ప్రశ్నించారు. సదరు వ్యక్తులు హిందీలో మాట్లాడారు. తాము పోలీసులమని చెప్పడంతో.. ఐడెంటిటీ కార్డులు చూపించాలని సీఐ ఆదేశించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయి ‘తూపాకీ తీసుకోరా.. కాల్చిపారేద్దాం’ అంటూ గద్దించడంతో సీఐ కాస్త వెనక్కు వెళ్లారు. అంతే పల్సర్‌ వాహనాన్ని తీసుకొని దుండగులు గుత్తివైపు ఉడాయించారు. జరిగిన ఘటనపై బాధిత సీఐ అనంతపురం రూరల్‌ సీఐ కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా