నాడు అలా.. నేడు ఇలా..

30 Jul, 2019 11:16 IST|Sakshi

స్కైలైన్‌ కేసులో మరో మలుపు

బందిపోటు దొంగతనం కేసులో తప్పుడు సమాచారం

అప్పట్లో బంగారం కొనడానికి డబ్బు తెచ్చినట్లు ఫిర్యాదు

పడిసి విక్రయించగా వచ్చిన నగదుగా అనుమానం

షాద్‌నగర్‌ నేరంతో వెలుగులోకి వచ్చిన కీలకాంశాలు

సాక్షి, సిటీబ్యూరో: 2017 నవంబర్‌ 25న హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని నారాయణగూడలో ఉన్న స్కైలైన్‌ అపార్ట్‌మెంట్స్‌లో భారీ బందిపోటు దొంగతనం జరిగింది. బంగారం కొనుగోలు చేయడానికి మైసూర్‌ నుంచి తీసుకువచ్చిన రూ.1.26 కోట్లు బందిపోటు దొంగల పాలైంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరున్నర గంటల్లోనే దొరికింది.
2019 జూన్‌ 28న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని షాద్‌నగర్‌ సమీపంలో ఉన్న రాయకల్‌ టోల్‌గేట్‌ సమీపంలో రూ.3.67 కోట్ల నగదు బందిపోట్లు ఎత్తుకుపోయారు. గత వారం కొలిక్కి వచ్చిన ఈ కేసు 2017 నాటి కేసులో ట్విస్ట్‌కు కారణమైంది. అప్పట్లో ఫిర్యాదు దారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

నాడు ఆలస్యం.. నేడు రహస్యం...
2017 నాటి నేరానికి సంబంధించి నాంగ్రే ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేశారు. ఈ నగదు దోపిడీ 2017 నవంబర్‌ 25 రాత్రి చోటు చేసుకోగా... పోలీసులకు ఆ మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ఫిర్యాదు అందింది. అది లెక్కల్లో లేని నగదు కావడంతో నాంగ్రే అనుమతి వచ్చిన తర్వాతే ఇక్కడున్న అతడి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రాయకల్‌ వద్ద జరిగిన దొంగతనం విషయంలోనూ నాంగ్రే అనుచరులు గోప్యత పాటించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం కారును బందిపోట్లు పట్టుకుపోయినట్లు చెప్పారు. అందులోని రహస్య అరల్లో ఉన్న రూ.3.67 కోట్ల విషయం వెల్లడించలేదు.

‘జీరో దందా’నే గోప్యతకు కారణం
దాదాపు రెండేళ్ల వ్యవధిలో రెండు కమిషనరేట్లలో ఈ నేరాలు చోటు చేసుకోవడానికి కారణం జీరో దందానే. రాజు నాంగ్రే చెందిన సొమ్మునే బందిపోటు దొంగలు ఎత్తుకుపోయారు. అప్పట్లో ఆ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ వంటవాడు, ఇప్పుడు మాజీ డ్రైవర్‌ సూత్రధారులుగా ఉన్నారు. అయితే లెక్కలు లేకుండా చేసే బంగారం వ్యాపారానికి సహకరిస్తూ తన వద్ద పని చేస్తున్న ఉద్యోగులకు నాంగ్రే ప్రత్యేక తర్ఫీదు ఇస్తాడు. ఏదైనా నేరం జరిగినప్పుడు తమ దందాకు ఎలాంటి నష్టం లేకుండా ఉండేలా ఫిర్యాదులు చేయిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే అప్పట్లోనూ నగదు వసూలు చేసుకుని వెళ్తుండగా... పసిడి ఖరీదు చేయడానికి వచ్చినట్లు ఫిర్యాదు చేయించాడు. రాయకల్‌ నేరంతో ఈ విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో నాంగ్రే ఉద్యోగులు పోలీసులకు సరైన సమాచారం ఇవ్వలేదని తేలింది. దీనిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు.  

ఇదీ తాజా నేరం వివరాలు
మైసూర్‌కు చెందిన రాజు నాంగ్రే (ఈసారి పేరు ఇలా చెప్పారు) కేరళ నుంచి తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని బంగారం వ్యాపారులకు విక్రయిస్తాడు. మహారాష్ట్రలోని ఖోపట్‌ ప్రాంతానికి చెందిన మయూరేష్‌ మనోహర్‌ నాంగ్రే వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ నగదు రవాణాపై అవగాహన ఉన్న అతను సుజాత, భోస్లే విశ్వజిత్‌ చంద్రకాంత్, ఆకాష్‌ కాంబ్లీ, సున్నీ చవాన్, ఆకాష్‌ దీపక్‌ రాథోడ్, సునీతలతో కలిసి రంగంలోకి దిగాడు. గతనెల 28న రాయకల్‌ టోల్‌ప్లాజా సమీపంలో  నగరం నుంచి వసూలు చేసి తీసుకువెళ్తున్న రూ.3.67 కోట్లు దోచుకుపోయారు. ఈ నెల 24న ముఠా ఎస్‌ఓటీకి చిక్కింది.  

ఇదీ నాటి కేసు కథ...
మైసూర్‌కు చెందిన రాజేంద్ర బ్యాటరీ వర్క్స్‌ (గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ వర్క్స్‌) యజమాని రాజేంద్ర హనుమంతు నాంగ్రే సిటీలో బంగారం కొనుగోలు చేయాలని భావించాడు. ఇందుకుగాను తన వద్ద పని చేసే స్వప్నిల్‌ మధుకర్‌ ఆమ్నే, సంకిత్, సంగప్పలకు రూ.1.26 కోట్లు ఇచ్చి కారులో 2017 నవంబర్‌ 25న హైదరాబాద్‌ పంపాడు. లాడ్జిలు, హోటళ్లలో బస చేస్తే పోలీసులు
తనిఖీలు ఉంటాయనే భయంతో వీరు బషీర్‌బాగ్‌లోని స్కైలైన్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో దిగారు. ఈ ముగ్గురి వద్దా భారీ మొత్తం ఉన్నట్లు గుర్తించిన సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ వంట మనిషి నానల్‌ కుమావత్‌ పథకం ప్రకారం పింజర్ల శ్రీహరి యాదవ్, పింజర్ల కునాల్‌ యాదవ్, జె.పరమేష్, పింజర్ల కుషాల్‌ యాదవ్‌తో కలిసి నగదు దోచుకెళ్లారు. 

మరిన్ని వార్తలు