ఉద్యోగంలోంచి తీసేశారని..

22 Feb, 2020 10:08 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

పని చేసిన సంస్థకే  కన్నం..

బావమరిదితో కలిసి గోదాంలో రూ.13 లక్షలు చోరీ  

నలుగురి అరెస్టు రూ.9.51లక్షల నగదు స్వాధీనం  

నాగోలు:  ఉద్యోగంలోంచి తొలగించారనే కోపంతో పనిచేసిన సంస్ధ గోదాంలో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని ఎల్‌బీనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9.51 లక్షల నగదు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి డీసీపీ యాదగరి వివరాలు వెల్లడించారు. కవాడిగూడ,  ముగ్లుబస్తీకి చెందిన  అన్నారం మల్లికార్జున్‌ ఎల్‌బీనగర్‌  సిరీస్‌ రోడ్డులోని నిక్కో లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గోదాంలో కస్టమర్‌ కేర్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు.  అయితే అతడి వైఖరి సరిగా లేకపోవడంతో సంస్థ నిర్వాహకులు ఇటీవల అతడిని ఉద్యోగంలోంచి తొలగించారు. దీంతో కంపెనీపై కోపం పెంచుకున్న మల్లికార్జున్‌ రాణింగంజ్‌లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న తన బావమరిది రోమల రాకేష్‌తో కలిసి గోదాం కార్యాలయం లాకర్‌లో ఉండే నగదు చోరీ చేయాలని పథకం పన్నాడు. పథకం ప్రకారం గోదాం షట్టర్‌ తాళం చెవులు దొంగలించిన మల్లికార్జున్‌ ఈ నెల 9న రాత్రి రాకేష్‌కు వాటిని అప్పగించాడు. రాకేష్‌ గోదాంకు చేరుకునేందుకు గాను మరో వ్యక్తి ఫోన్‌ నుంచి ఓలా క్యాబ్‌ బుక్‌ చేయించాడు.

క్యాబ్‌లో గోదాంకు చేరుకున్న రాకేష్‌ షట్టర్‌ తెరిచి లోపలికి వెళ్లగా మల్లికార్జున్‌ వాట్సప్‌ కాల్‌ ద్వారా అతడికి డైరెక్షన్‌ ఇచ్చాడు. అతడి సూచనల మేరకు రాకేష్‌ గోదాంలో ఉన్న సీసీ కెమెరాలు, డీవీఆర్‌ను తొలగించాడు. అనంతరం లాకర్‌ తెరచి అందులో ఉన్న రూ. 13 లక్షల నగదు, డీవీఆర్‌ తీసుకుని  ప్రహరీ దూకి బయటికి వచ్చాడు. అనంతరం క్యాబ్‌ బుక్‌ చేసుకుని అక్కడినుంచి పరారయ్యాడు. అనంతరం ఇద్దరూ కలిసి బ్యాగులో ఉన్న నగదును బయటికి తీసి  తక్కువ డినామినేషన్‌తో ఉన్న నోట్లను రూ.2 వేల నోట్లలోకి మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను వారు ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్‌ అస్తామ్‌ అబ్దుల్‌ నదీం ఖురేషిలను సంప్రదించారు. గోదాం లాకర్‌లో  నగదు కనిపించకపోవడంతో మర్నాడు ఉదయం కంపెనీ యాజమాని శ్రీకాంత్‌ ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎల్‌బీనగర్‌ డీఐ కృష్ణమోహన్, క్రైమ్‌ సిబ్బందితో సీసీ కెమెరాల పుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితుల ఆచూకీ గుర్తించారు. శుక్రవారం ఉదయం ఎల్‌బీనగర్‌లో   నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు.  మల్లికార్జున్‌ నుంచి రూ.9.51 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోదాం నుంచి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరాల డీవీఆర్‌ను కవాడిగూడ నాలలో  పడేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీకి పాల్పడిన ఇద్దరితో పాటు నగదు మార్చేందుకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌రావు, ఎల్‌బీనగర్‌ సీఐ అశోక్‌రెడ్డి, డీఐ కృష్ణమోహన్, డీఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి, క్రైమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు