వియ్యంకుల పనేనా..?

26 Oct, 2019 07:52 IST|Sakshi

చర్చనీయాంశంగా మారిన బోయిన్‌పల్లి చోరీ  

వియ్యంకుల ఇంట్లో చోరీ చేసిన వ్యాపారి కుటుంబం  

కామారెడ్డిలో బోయిన్‌పల్లి పోలీసుల తనిఖీలు  

కామారెడ్డి క్రైం: సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి ప్రాంతంలోని ఓ వడ్డీ వ్యాపారి ఇంట్లో నాలుగు రోజుల క్రితం జరిగిన భారీ చోరీ ఉదంతం కామారెడ్డిలో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డికి చెందిన ఓ వ్యాపారి కుటుంబమే చోరీకి పాల్పడినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికితోడు శుక్రవారం నిందితుల ఇంట్లో బోయిన్‌పల్లి పోలీసులు సోదాలు నిర్వహించడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కామారెడ్డికి వచ్చిన బోయిన్‌పల్లి పోలీసులు నిందితుల ఇంట్లో తనిఖీల అనంతరం బ్యాంక్‌లో వారికి సంబంధించిన ఖాతాలు, లాకర్ల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... ఓల్డ్‌బోయిన్‌పల్లి, మల్లికార్జుననగర్‌ కాలనీలో ఉంటున్న సరళ అనే వడ్డీ వ్యాపారి ఇంట్లో గత సోమవారం భారీ చోరీ జరిగింది.

మూడు కిలోల బంగారం, రూ.18 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. సరళ కుమారుడికి నాలుగునెలల క్రితం కామారెడ్డిలోని రామారెడ్డి చౌరస్తాలో ఉంటున్న వ్యాపారి కుమార్తెతో వివాహం జరిగింది. ఆమె కోడలు కుటుంబ సభ్యులే ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. సదరు వ్యాపారి, అతని భార్య, కుమారుడితో పాటు కుమార్తెకు కూడా ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే చోరీ సొత్తు పూర్తిస్థాయిలో రికవరీ కాకపోవంతో శుక్రవారం నిందితులను వెంటబెట్టుకుని కామారెడ్డికి వచ్చిన పోలీసులు వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం సమీపంలోని  బ్యాంకుకు వెళ్లి నిందితుల ఖాతాల వివరాలు, లాకర్లలో ఉన్న నగదు, బంగారంపై విచారణ జరిపినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు