దారికాచి దాదాగిరి

5 Mar, 2019 10:05 IST|Sakshi
నిందితుడు మహేష్‌

ఇందిరానగర్‌లో మందుబాబుల వీరంగం

కత్తులు, కర్రలతో దాడి

పలువురిని బెదిరించి దారి దోపిడీ

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–2లోని ఇందిరానగర్‌లో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న 15 మంది యువకులు దారికాచి అటు వెళుతున్న వారిని అడ్డగిస్తూ సెల్‌ఫోన్లు, నగదు దోచుకుంటూ బీభత్సానికి పాల్పడ్డారు. ఇదేమిటని అడిగిన వారిని చితకబాదారు. తప్పించుకొని ఇళ్లల్లోకి పారిపోయినా కత్తులు, కర్రలు, రాడ్లతో వెంటపడ్డారు. ఇళ్ల ముందు బీరు బాటిళ్లను పగులగొట్టి భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రోడ్‌ నెంబర్‌–2లోని ఇందిరానగర్‌లో నివసించే కృష్ణ అనే యువకుడు ఆదివారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రిచ్‌మండ్‌ స్కూల్‌ దాటి ముందు గల్లీలోకి వెళ్లగానే అప్పటికే అక్కడ మాటు వేసిన మహేష్‌ అలియాస్‌ మయి, సుతార్‌ మహేష్, నవీన్, తేజశివ, సురేష్, మల్లి, రాకేష్‌ తదితరులు అతడిని అడ్డగించారు.

అప్పటికే వారు కొందరిని అడ్డుకుని బలవంతంగా వారి జేబులో ఉన్న నగదు లాక్కుని సమీపంలోని మైదానంలోకి వెళ్లి బీర్లు తాగారు. మళ్లీ బీర్లు, గంజాయి తాగడానికి డబ్బులు అవసరం కావడంతో అటుగా వస్తున్న కృష్ణను అడ్డగించారు. వారి నుంచి తప్పించుకున్న కృష్ణ తన తమ్ముడు సాయి ఇంట్లోకి వెళ్లగా మందుబాబులు అతడిని వెంబడించి ఇంటికి వద్దకు వెళ్లి బీరు బాటిళ్లు పగులగొడుతూ కత్తులు, కర్రలతో అరగంటపాటు వీరంగా సృష్టించారు. ఈ ఘటనలో నిషాంత్, సాయి అనే యువకులకు గాయాలయ్యాయి. అడ్డువచ్చిన వారిని పగిలిన బీర్‌ బాటిల్‌తో పొడుస్తామంటూ బెదిరించారు. బాధితులు సమాచారంఅందించడంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోగా నిందితులు పరారయ్యారు. నిషాంత్, సాయి తదితరులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహేష్, నవీన్, తేజశివ, సుతార్‌ మహేష్, సురేష్, రాకేష్, మల్లి తదితరులతో పాటు 15 మంది తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నోవా కాలేజీలో బీటెక్‌ చదువుతున్న నిందితుడు మహేష్‌ అలియాస్‌ మయిని అదుపులోకి తీసుకున్నారు. కత్తి, బీరు బాటిళ్లతో దాడి చేసిన నవీ, సుతార్‌ మహేష్‌ కోసం గాలింపు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు