పగలు రెక్కీలు..రాత్రి లూటీలు

31 Dec, 2019 11:19 IST|Sakshi
సత్యనారాయణ వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్‌భగవత్‌

జైలుకు వెళ్లి వచ్చినా మారని పంథా

తెలుగు రాష్ట్రాల్లో పలు నేరాలు

పాత నేరస్తుడి అరెస్టు

రూ.13.80లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం

నేరేడ్‌మెట్‌: పగటి పూట బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ  రెక్కీలు నిర్వహిస్తూ, రాత్రివేళల్లో ఇళ్ల లూటీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని  సీసీఎస్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్‌ పోలీసులు సంయక్తంగా అరెస్టు చేశారు. అతడి నుంచి 26 తులాల బంగారు, 1.5 కిలోల వెండి, రూ.87వేల నగదు, బైక్, టీవీతోపాటు  మొత్తం రూ.13.80లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు.  

తూర్పుగోదావరి జిల్లా, యెదిత గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ పాత నేరస్తుడు. అతను ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతుండటంతో గతంలో కడియం, మండవల్లి, యలమంచలి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఐదు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యరారాయణ గత జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాడు. 

చందానగర్‌లో మకాం...
అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన అతను చందానగర్‌లో ఉంటూ కొన్నాళ్లపాటు మేస్త్రీగా పని చేశాడు. అయితే తన సంపాదన సరిపోకపోవడంతో మళ్లీ  పాత పంథాను అనుసరిస్తున్నాడు. చందానగర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ రింగ్‌ రోడ్‌ వరకు పగటి పూట బైక్‌పై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవాడు.  సెకండ్‌ షో సినిమా చూసిన తర్వాత రాత్రివేళల్లో ఇళ్ల తాళాలు పగులకొట్టి బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును ఎత్తుకెళ్లేవాడు. పోలీసులు ఆపితే  మేస్త్రీనంటూ పనికి వెళ్లొస్తున్నట్లు చెప్పేవాడు. సత్యనారాయణ ఇటీవల కొత్తపేటలోని చైతన్యపురి, గ్రీన్‌హిల్స్, సరూర్‌నగర్‌లోని కృష్ణానగర్, హనుమాన్‌నగర్, ఎల్‌బీనగర్‌లోని చంద్రపురి కాలనీ, శాతవాహన నగర్, వనస్థలిపురంలోని భాగ్యలత కాలనీ, కుంట్లూరు, ముంగనూరు, ఆర్టీసీ సూపర్‌వైజర్స్‌ కాలనీ, ఆదిభట్ల, తుర్కయంజాల్‌లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. 

చిక్కిందిలా..
చోరీ జరిగిన ఇళ్లలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా  విచారణ చేపట్టిన పోలీసులు పాత నేరస్తుడు సత్యనారాయణ పనిగా గుర్తించారు. దీంతో అతడి వివరాలపై ఆరా తీయగా చందానగర్‌లో ఉంటున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి హయత్‌నగర్‌ ఠాణా పరిధిలోని మునుగునూరులో చోరీకి యత్నిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు.

రెండు రాష్ట్రాల్లో 33 కేసులు..
ఏపీలోని అన్నవరంతోపాటు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌బీ.నగర్, హయత్‌నగర్, మీర్‌పేట, వనస్థలిపురం, ఆదిభట్ల, చౌటుప్పల్, అబ్దుల్లాపూర్‌మెట్, పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిందితుడిపై మొత్తం 33 చోరీ కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనబరచిన హయత్‌నగర్, సీసీఎస్, ఎల్‌బీనగర్‌ పోలీసులను సీపీ అభినందించి, రివార్డులు అందజేశారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, క్రైం డీసీపీ యాదగిరి, అడిషనల్‌ డీసీపీ  శ్రీనివాస్, సీఐలు ప్రవీణ్‌బాబు, అశోక్‌కుమార్, ఎస్‌ఐలు మైసొద్దీన్, రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు