పట్టపగలే దొంగల హల్‌చల్‌

21 Jan, 2020 13:13 IST|Sakshi
గ్రామస్తులకు పట్టుపడ్డ ముగ్గురు దొంగలు

ఓ ఇంట్లో చొరబడి నగలు, నగదు అపహరణ

వెంటబడి పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

జూలూరుపాడు మండలం జేత్యాతండాలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం,జూలూరుపాడు: ఓ ఇంట్లోకి ముగ్గురు దొంగలు పట్టపగలే చొరబడి నగదు, నగలు అపహరించారు. గ్రామస్తులు గమనించి వెంటపడి పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ జేత్యాతండాలో సోమవారం చోటుసుకుంది. మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ జేత్యాతండాకు చెందిన గుగులోత్‌ కీర్యా, లక్ష్మి దంపతులు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి పొలానికి పనుల నిమిత్తం వెళ్లారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దొంగలు కీర్యా ఇంటి తాళం పగుల గొట్టారు. మొదట ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించగా, మరొకరు బయట కాపలాగా ఉన్నాడు. అనంతరం అతను కూడా ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువా పగులగొట్టి రెండు తులాల బంగారు నగలు, లక్ష రూపాయల నగదు తీసుకున్నారు.

అదే సమయంలో పొలానికి వెళ్లిన గుగులోత్‌ కీర్యా నీళ్ల పైపుల కోసం ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి ఆందోళనతో లోపలికి వెళుతుండగా.. ఇంట్లో ఉన్న దొంగలు బయటకు కీర్యాను నెట్టివేసి పారిపోయారు. దీంతో ఆయన పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి దొంగల వెంటపడ్డారు. ముగ్గురిని పట్టుకుని తాళ్లతో కట్టి వేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలూరుపాడు ఎస్సై పి.శ్రీకాంత్‌ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు దొంగలను పోలీసులకు అప్పగించారు. వీరిలో ఇద్దరు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పులి నరేష్, తిరుమల యువరాజ్‌లని, మరొకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన  గురువెళ్లి మల్లేశ్వరరావు  అని పోలీసులు తెలిపారు. వీరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి, హైదారాబాద్‌ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదౖలైనట్లు తెలుస్తోంది. దొంగలు వేసుకుని వచ్చిన బైక్‌ సైతం ఖమ్మంలో చోరీ చేసినట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు