కారును అడ్డగించి..కత్తులతో బెదిరించి..

22 Feb, 2019 11:41 IST|Sakshi
తవణంపల్లె పోలీస్‌ స్టేషన్‌లో కారుపై వేలిముద్రలు సేకరిçస్తున్న క్లూస్‌టీం హెచ్‌సీ దినేష్‌కుమాÆŠ

అర్ధరాత్రి దారిదోపిడీ దొంగల స్వైరవిహారం

కర్ణాటక వాసుల కారును వెంబడించి దోపిడీకాండ

బంగారు నగలు, నగదు, సెల్‌ఫోన్లు అపహరణ

గంగవరం వద్ద కారును వదలి పరారీ

చిత్తూరు, తవణంపల్లె : అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్‌చల్‌ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో స్వస్థలానికి వెళ్తున్న కర్ణాటక వాసులను దోపిడీ దొంగలు వెంబడించారు. కారుపై  ఇనుపరాడ్లతో దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. కత్తులతో  బెదిరించారు. కారులోని మహిళల నుంచి మంగళసూత్రంతో సహా బంగారు నగలు, నగదు, సెల్‌ఫోన్లను లాక్కొని పరారయ్యారు. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన మండలంలో చోటుచేసుకుంది.

బాధితులు, పోలీసుల కథనం..
కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లా, సొంటికొప్ప టౌన్‌కు చెందిన తమ్మయ్య తన భార్య యస్సు, కుమార్తె చైతన్య, కొడుకు ప్రశాంత గణపతితో కలిసి తిరుమల, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. అనంతరం బుధవారం రాత్రి 9.30 గంటలకు  శ్రీకాళహస్తి నుంచి కారులో (కేఏ 12 ఎన్‌ 8476) స్వస్థలానికి బయలుదేరారు. వీరిని మత్యంలో రోడ్డులోని హంద్రీ–నీవా కాలువ కల్వర్టు దగ్గర గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు  మారుతీ ఎకో (కెఎ 05 ఎంహెచ్‌ 4042) వ్యానులో వచ్చి కారుకు అడ్డంగా పెట్టి నిలువరించారు. ఆపై, దుండగులు   ఇనుప రాడ్లతో కర్ణాటక వాసుల కారు ముందరి,, వెనుక డోర్‌ అద్దాలను పగులగొట్టారు. అరిస్తే చంపుతామంటూ గొంతుల వద్ద కత్తులు పెట్టి హడలెత్తించారు.

యస్సు అనే మహిళ మంగళసూత్రం, చైతన్య బంగారు చైన్, ఉంగరం, కమ్మలు, ప్రశాంత గణపతి మెడలోని చైన్‌ను, రెండు విలువైన సెల్‌ఫోన్లు బలవంతంగా లాక్కొన్నారు. ఆ సమయంలో దిగువ మత్యంకు చెందిన అనిల్‌తో పాటు మరో అతను మోటారు సైకిల్‌పై వస్తుండగా నలుగురు దొంగలు వారిని చూసి వ్యానులో పరారయ్యారు. అనిల్‌కు బాధితులు జరిగిన సంఘటను తెలియజేయడంతో వారు దోపిడీ దొంగల్ని పట్టుకునేందుకు ముట్టుకూరు వరకు వెంబడించినా ఫలితం లేకపోవడంతో వెంటనే తవణంపల్లె పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో   బంగారుపాళ్యం, పలమనేరు పోలీస్‌ స్టేషన్లకు పోలీసులు సమాచారం చేరవేసి అప్రమత్తం చేశారు.   దుండగులు ఉపయోగించిన మారుతి ఎకో వ్యానును గంగవరం దగ్గర వదలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ వ్యానును స్వాధీనం చేసుకున్న పోలీసులు గంగవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  దుండగుల్లో ఒకడు మాత్రం ముఖానికి గుడ్డ కట్టుకుని ఉన్నాడని, వీరంతా 30–35 ఏళ్లలోపు వారని బాధితులు తెలిపారు. తమ నుంచి బలవంతంగా లాక్కుపోయిన నగల విలువ రూ.4లక్షల వరకూ ఉంటుందని పేర్కొన్నారు.

వేలిముద్రలు సేకరించిన క్లూస్‌ ట్రీం
 క్లూస్‌టీం హెచ్‌సీ దినేష్‌కుమార్‌ బాధితుల కారు, దుండగుల ఉపయోగించిన కారుపై వేలిముద్రలను సేకరించారు. ప్రశాంత గణపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పాండురంగం  తెలిపారు.

దొంగల కారుతో ‘క్లూ’ లభించేనా?
దోపిడీ దొంగలు వదిలేసిన కారు ఇప్పుడు ‘కీ’లకమైంది. కారు నంబర్‌ ఆధారంగా ఇదెవరిదో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. ఒకవేళ దొంగలు ఈ కారును చోరీ చేసి, దోపిడీకేమైనా ఉపయోగించారా?  అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అందులో కారుకు సంబంధించి, దోపిడీ దొంగలకు సంబంధించిన మరేవైనా ఇతర ఆధారాలు లభించిందీ, లేనిదీ తెలియరాలేదు. 

మరిన్ని వార్తలు