గ్యాంగ్స్‌ ఔట్‌!

25 Oct, 2019 09:51 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వరుస దాడులు  

మూడు గ్యాంగ్‌లలోని 8 మంది అరెస్టు  

మూడు కమిషనరేట్లలోని 12 కేసులు కొలిక్కి  

రూ.9 లక్షల విలువైన సొత్తు స్వాధీనం  

దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు క్రిమినల్‌ గ్యాంగ్‌ల ఆట కట్టించారు. గురువారం వరుసగా దాడులు నిర్వహించి మొత్తం మూడు గ్యాంగ్‌లలోని 8 మందిని అదుపులోకితీసుకున్నారు. కత్తులు, డాగర్లతో అర్ధరాత్రి ఆటోల్లో తిరుగుతూ ఒంటరిగా కనిపించే వారిని బెదిరించి దోచుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. టిక్‌టాక్‌ వీడియోలు చేయాలనే ఆసక్తితో రెండు స్మార్ట్‌ఫోన్లను దొంగిలించిన ఇద్దరిని, కత్తులు వినియోగించిభారీ దోపిడీ చేయాలని పథకం పన్నిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరి నుంచి రూ.9 లక్షల విలువైన సొత్తు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం వరుస దాడులు చేసి మూడు గ్యాంగ్‌లకు చెందిన ఎనిమిది మంది నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మారణాయుధాలతో పాటు రూ.9 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌తో కలిసి గురువారం తన కార్యాయంలో వివరాలు వెల్లడించారు.  ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

ఒంటరి వ్యక్తులే టార్గెట్‌గా...
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహ్మద్‌ అక్బరుద్దీన్‌ ఫారూఖీ, మహ్మద్‌ మోహిసిన్, మహ్మద్‌ ఖదీర్, మీర్‌ షానవాజ్‌ అలీ ముఠాగా ఏర్పడ్డారు. కత్తులు, డాగర్ల తో అర్థరాత్రి ఆటోలో తిరుడుతూ రోడ్డుపై ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, నగదు దోచుకునేవారు. వీరిపై బహదూర్‌పుర, ఫలక్‌నుమా, మొఘల్‌పుర, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో మొహిసిన్‌పై 10, ఫారూఖీపై 11, మహ్మద్‌ ఖదీర్‌పై 4, అలీపై 2 పాత కేసులు ఉన్నాయి. గురువారం వీరిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

టిక్‌–టాక్‌పై మోజుతో...
పాతబస్తీ, ఛత్రినాక పరిధిలోని ఉప్పుగూడకు చెందిన బి.రమేష్‌ సినీ రంగంలో వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇతడి స్నేహితుడైన అదే ప్రాంత వాసి రంగాపురం కుమార్‌ ఆటోడ్రైవర్‌. తరచూ ఇద్దరూ కలి మద్యం తాగేవారు. వీరికి టిక్‌–టాక్‌ యాప్‌లో వీడియోలు చేయాలనే సరదా. అయితే దానికోసం స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కునే స్థోమత లేకపోవడంతో వాటిని తస్కరించాలని పథకం వేశారు. చంద్రాయణగుట్ట, ఛత్రినాక ప్రాంతాల నుంచి రెండింటిని చోరీ చేశారు. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  

దోపిడీలకు పథకం...
పాత నేరగాళ్లైన కాలాపత్తర్‌ రౌడీషీటర్‌ షేక్‌ ఒబేద్, అబ్దుల్‌ లతీఫ్‌ ఖాన్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఒబేద్‌పై ఇప్పటికే 36 కేసులు ఉన్నాయి. ఘరానా దొంగ మంత్రి శంకర్‌కు  ప్రధాన అనుచరుడైన అతడిపై గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్‌ కూడా ప్రయోగించారు. రెండు నెలల క్రితం జైలు నంంచి వచ్చిన ఇతను లతీఫ్‌తో కలిసి రంగంలోకి దిగాడు. కత్తులు వినియోగించి భారీ దోపిడీలకు పథకం వేశాడు. దీనిపై సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో వీరిపై కంచన్‌బాగ్, హుస్సేని ఆలం, నార్సింగి, మీర్‌పేట ఠాణాల్లో ఐదు కేసులు, ఒబేద్‌పై 11, లతీఫ్‌పై మూడు నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. 

మరిన్ని వార్తలు