చోరుల హల్‌చల్‌

23 Mar, 2018 11:14 IST|Sakshi

గంటల వ్యవధిలోనే దొంగతనాలు

బెంబేలెత్తిపోతున్న నగరవాసులు

పోలీసులకు సవాల్‌ విసురుతున్న దొంగలు

నగరంలో చోరులు హల్‌చల్‌ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా తాళం వేసి వెళ్లి గంటలోనే తిరిగి వచ్చే లోపే పనికానిచ్చేసి నగర వాసులను బెంబేలెత్తిస్తున్నారు. పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

విశాఖ క్రైం: నగరంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరుగుతన్న ఇంటి దొంగతనాలు పోలీసులతో పాటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళాలు తీయకుండా కిటకీలను లక్ష్యంగా చేసుకుని.. వెనుక తలుపులు బద్ధలు గొట్టి  దొంగతనాలకు పాల్పడుతున్నారు.

పగటిపూట పెరిగిన చోరీలు
గతంలో అర్ధరాత్రులు, ఒంటిరిగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా దొంగతనాలు జరిగేవి. ప్రస్తుతం దొంగలు పంథా మార్చారు. ఇతర రాష్ట్రాల ముఠాలతో చేతులు కలిపి దోపిడీలు, బెందిరింపులకు గురి చేసి అందినకాడకి దోచుకుపోతున్నారు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది కొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఈజీగా పని కానిచ్చేస్తున్నారు.  సిబ్బంది కొరతతో సతమతమవుతున్న పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయలేని దుస్థితిలో వుంది.

నగరంలో ఇతర రాష్ట్రాల ముఠాలు
బిహార్, ఝార్కండ్, ఒడిశా, గుంటూరు, ప్రకాశం, రాజస్తాన్‌ కు చెందిన ముఠాలు నగరంలోకి దిగాయి. వీరితో స్థానిక దొంగులు చేతులు కలుపుతున్నారు.  నగరంలోని విశాఖ ,విజయనగరం, నెల్లూరు, కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చి ముందుగా తాళాలు వేసిన ఇళ్లును రెక్కీ నిర్వహిస్తారు. వీలు చిక్కినప్పుడు దొంగతనాలకు పాల్పడతారు. నగరానికి చెందిన మామిడి తిరుపతిరావు, రౌతు మల్లేష్, దున్న కృష్ణ, మణికంఠ, జి.పైడిరాజ్, తోట శివభవానీ తదితరులు ఇంటి దొంగతనాలు చేస్తుంటారు.

పోలీసులు తిరుగుతున్నా..
ఎంవీపీకాలనీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ మాజీ ఉద్యోగి, చినవాల్తేరులోని రెండు ఇళ్లలో పట్టపగలే  దొంగతనాలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా తిరుగుతున్నా దొంగతనాలు మాత్రం సర్వసాధారణం అయిపోయాయి.  చినముషిడివాడలో కూడా ఎంవీపీ కాలనీ తరహాలోనే ఇంట్లో అద్దెకి దిగుతామని చెప్పి దొంగతనం చేయడం తెలిసిందే. సీతమ్మధారలోని గత వారం రోజుల్లో మూడు ఇళ్ల తాళాలు పగలుగొట్టిన సంఘటనలతో స్ధానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.  దొండపర్తి, ద్వారకానగర్‌లో వరుసుగా  ఇంటి దొంగతనాలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఇంటి దొంగతనాలే అధికం
2016లో విశాఖలో 30 ఇంటి దొంగతనాలు జరిగాయి. ఇందులో 17 కేసుల్లో నేరస్తులను గుర్తించారు. 2017లో 35 కేసులు నమోదు కాగా , 8 కేసుల్లో మాత్రమే నేరస్తులను పట్టుకున్నారు. 2018 లో పదుల సంఖ్యలో ఇంటి దొంగతనాలు జరిగాయి.

భోపాల్‌ గ్రూప్‌ (ఎంపీ)
 మధ్యప్రదేశ్‌కు చెందిన భోపాల్‌ గ్రూప్‌ది స్నాచింగ్‌లకు అందవేసినచెయ్యి. ఒకేసారి నగరంలోని పలు చోట్ల స్నాచింగ్‌లు చేసి పారిపోతారు. విశాఖలో 2010లో సుమారు ఒకే రోజు 10 చోట్ల చైన్‌స్నాచింగ్‌లు చేశారు.వీరు విడతల వారీ దిగుతారు.

చెన్నై గ్యాంగ్‌ (మద్రాస్‌)
మద్రాస్‌లోని రామపురం గ్యాంగ్‌ నగరంలోకి వచ్చి కారు డోర్‌ వద్ద డబ్బులు వేసి పక్కతోవ పట్టిస్తుంటారు. వెంటనే దొంగతనం చేస్తారు. ఈ గ్యాంగ్‌ ముందుగా బ్యాంకుల నుంచి ఎవరు డబ్బులు డ్రా చేస్తారో చూస్తుంటారు. తర్వాత పక్కగా ప్లాన్‌ గీసి చోరీకి పాల్పడతారు.

ఆటో ముఠాలతో బహుపరాక్‌
విజయనగరం జిల్లా కొత్తవలసలో 202 కాలనీ గ్యాంగ్‌. వీరంత ఆటోలో ప్రయాణించి ఒక ముఠాగా ఏర్పాడి ప్రయాణికుల నుంచి బ్యాగు దోచుకుంటారు. మహిళలు, యువకులు బ్యాగ్‌లు తెలియకుండా తస్కరిస్తారు. ఇది చాలా డేంజరస్‌ ముఠా.

అప్రమత్తంగా ఉండాలి
నగరంలో జరుగుతున్న ఇంటి దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.  అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే సంబంధించిన పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. ఇంటి కిటికీ తులుపులు తీసి ఉంచరాదు. ఊరు వెళ్లిన వారు ఇంటికి తాళాలు వేసి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. బంగారు నగలు బ్యాంకు లాకర్‌లో ఉంచుకోవాలి.– రామకృష్ణ, క్రైం,ఎస్‌ఐ, ఫోర్తుటౌన్‌

మరిన్ని వార్తలు