ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో భారీ చోరీ

12 Jun, 2018 12:20 IST|Sakshi
బీరువాలో దొంగలు వదిలేసిన వంద రూపాయల నోట్ల కట్టలు

మంగళగిరిరూరల్‌: మంగళగిరి మండల పరిధిలోని చినకాకానిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే... మంగళగిరి, చినకాకానిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో అకౌంట్‌ సెక్షన్‌ బీరువాలో పెట్టిన నగదు సోమవారం ఉదయం చూసేసరికి కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆసుపత్రి సిబ్బంది మంగళగిరి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం... ఆస్పత్రిలోనిఅకౌంట్స్‌ సెక్షన్‌లోని బీరువాలో శుక్రవారం రూ.11,49,080 క్యాషియర్‌ అనిల్‌కుమార్‌ భద్రపరిచారు. రెండవ శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో, సోమవారం ఉదయం ఆఫీస్‌కు వచ్చి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు చూడగా ఉన్న మొత్తంలోనుంచి రూ.9.70 లక్షలు చోరీకి గురయ్యాయి.

అపహరించిన వారు కేవలం 2వేల రూపాయలు, 500 రూపాయల నోట్ల కట్టలు మాత్రమే దొంగిలించి, 100 కట్టలు, మిగతా చిల్లర అక్కడే వదిలేసి వెళ్లారు. అకౌంట్స్‌ సెక్షన్‌లో ఎటువంటి సి.సి కెమెరాలు లేకపోవడం, పక్కనే వేరే భవనం నిర్మాణంలో ఉండడం, అకౌంట్‌ సెక్షన్‌లోకి క్యాంటిన్‌ నుంచి ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ దొంగకు కలిసి వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సంఘటనా స్థలం వద్ద గుంటూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం వేలిముద్రల సేకరణ చేపట్టింది. డీఎస్పీ జి.రామకృష్ణ, సీఐ సుబ్బారావు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. ఆస్పత్రిలో పనిచేసే అకౌంట్స్‌ సిబ్బందిని, భవన నిర్మాణ పనివారిని, క్యాంటిన్‌ సిబ్బందిని, పోలీస్‌స్టేషన్‌కు పిలి పించి, వారి వద్దనుంచి వేలిముద్రల సేకరించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటుచేయమని హెచ్చరించిన పోలీసులు
ఆస్పత్రిలోని అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ ఆసుపత్రి యాజమాన్యాన్ని హెచ్చరించారు. గతంలో కూడా ఎన్నోసార్లు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమని చెప్పామని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దొంగలను పట్టుకోవడానికి అవి ఎంతో సహకరిస్తాయన్నారు.

మరిన్ని వార్తలు