జంక్షన్‌లో భారీ చోరీ

29 Aug, 2018 13:04 IST|Sakshi
దుండగులు వదిలేసిన ఆభరణాలు (అంతరచిత్రం) బాధితుడు లక్ష్మీరెడ్డి

 రూ.9.20 లక్షల నగదు, 40 కాసుల బంగారు ఆభరణాల అపహరణ

కృష్ణా , హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం) : హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ఓ ప్రముఖ హోల్‌సేల్‌ కిరాణా వ్యాపారి ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో సుమారు 40 కాసుల బంగారు ఆభరణాలు, రూ.9.20 లక్షల నగదు అపహరణకు గురైంది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి తలుపులు పగులకొట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. గత ఐదు రోజులుగా ఇంట్లో ఎవ్వరూ లేకపోవటాన్ని గుర్తించిన దుండగులు పక్కా పధకంతో చోరీకి తెగబడ్డారు. హనుమాన్‌జంక్షన్‌ ప్రధాన కూడలికి, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఇంట్లోనే దుండగులు చోరీకి పాల్పడటం ఖాకీలకు సవాల్‌గా మారింది. నాలుగైదు రోజులుగా పోలీసులు ఇతర కేసు దర్యాప్తులో బీజీగా ఉండటంతో దుండగులు చోరీకి అనువైన స్థలంగా ఎంచుకున్నారనే అనుమానాలు వినిపిస్తున్నారు.

పక్కింటి పైనుంచి మొదటి అంతస్తులోకి..
స్థానిక గుడివాడ రోడ్డులోని విజయలక్ష్మీ జనరల్‌ స్టోర్స్‌ అధినేత రాగిపిండి లక్ష్మీరెడ్డి నివాసంలో చోరీ జరిగింది. ఈ నెల 23వ తేదీన లక్ష్మీరెడ్డి భార్య విజయలక్ష్మికి శస్త్రచికిత్స నిమిత్తం ఇంట్లో వాళ్లందరూ విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఐదు రోజులు ఇంటికి తాళం వేసి ఉంది. లక్ష్మీరెడ్డి హోల్‌సేల్‌ కిరణా వ్యాపారం కావటంతో ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గోడౌన్‌ ఏర్పాటు చేసుకుని సరుకు నిల్వ చేశారు.
ఈ గోడౌన్‌లో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు పనివాళ్లు ఉంటారు. ఇంటి మొదటి అంతస్తులో లక్ష్మీరెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. పై అంతస్తుకు వెళ్లటానికి ఖచ్చితంగా గోడౌన్‌ వద్ద ఉన్న మెట్ల మార్గం ద్వారానే వెళ్లాలి. కానీ దుండగులు పక్క డాబాపైకి ఎక్కి అక్కడి నుంచి లక్ష్మీరెడ్డి నివాసం ఉంటున్న బిల్డింగ్‌ మొదటి అంతస్తుకు ఉన్న అద్దాల కిటికి తొలగించి లోనికి ప్రవేశించారు. మొదటి అంతస్తులోని వెనుక భాగంలోకి కారిడార్‌ గుండా వెళ్లి గది తలుపులు పగులకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. రెండు బెడ్‌రూమ్స్‌లో బీరువాలను తెరిచి అందులోని దుస్తులు చిందరవందర చేశారు. మొదటి బెడ్‌రూంలోని బీరువాలో దాచిన రూ.70 వేలు, బంగారు ఆభరణాలు అపహరించారు. ఆ తర్వాత రెండో బెడ్‌రూం తలుపులను పలుగు సాయంతో పగులకొట్టి, ఆ గదిలోని టేబుల్‌ సొరుగులో ఉన్న రూ.8 లక్షలు, బీరువాలోని బంగారు ఆభరణాలను దొంగిలించారు.

కొన్ని వస్తువులు వదిలేసి..
లక్ష్మీరెడ్డి ఇంట్లో చోరీ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. దుండగులకు ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం తెలియటంతో చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో డబ్బులు, ఆభరణాలు భద్రపరిచే ప్రదేశాలు కూడా స్పష్టంగా దుండగులకు తెలిసి ఉండవచ్చనే అనుమానం ఘటనా జరి గిన తీరును బట్టి పోలీసులు అంచనా వేస్తున్నా రు. శుక్ర, శనివారాల్లో రాత్రిపూట లక్ష్మీరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఇంటికి వచ్చి నిద్రపోయారని, దీంతో ఆదివారం లేక సోమవారం రాత్రి వేళలోనే దొంగతనం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆస్పత్రికి దుస్తులు తీసుకువెళ్లేందుకు లక్ష్మీరెడ్డి కుటుంబ సభ్యులు కృష్ణవేణి, రత్నకుమారి ఇంటికి వచ్చారు. ప్రధాన ద్వారం తెరిచి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి రెండు బెడ్‌రూమ్స్‌ తలుపులు తీసి ఉండటం, వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని లక్ష్మీరెడ్డికి చెప్పటంతో హుటాహుటిన ఇంటికి వచ్చి చోరీ జరిగిన సమాచారాన్ని పోలీసులకు అందజేశారు.

దీంతో జం క్షన్‌ ఎస్‌ఐ వి.సతీష్‌ ఘటనా స్థలికి వచ్చి పరిశీ లించటంతో పాటు లక్ష్మీరెడ్డిని పలు విషయాలపై ఆరా తీశారు. దుండగులు బెడ్‌రూంలో కొన్ని ఆభరణాలను అక్కడే వదిలి వేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగతనానికి వచ్చి బీరువాలో ఒకేచోట ఉన్న కొన్ని బంగారు వస్తువులు తీసుకువెళ్లి, మిగిలిన ఆభరణాలు వదిలివేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీరువా తలుపులు కూడా పగలకొట్టకుండా ఇం ట్లోనే భద్రపర్చిన వాటి తాళాలను నిందితుడు వెతికి వాటి ద్వారానే బీరువా తెరవటం కూడా పోలీసులను విస్మయానికి గురి చేసింది. ఇంటి వెనుక వైపు గది తలుపులు చాలా బలహీనంగా ఉండటంతో సునాయాసంగా పగులకొట్టుకుని దుండగులు లోనికి వచ్చారు. మచిలీపట్నం నుంచి సీఐ బాబూరావు నేతృత్వంలోని క్లూస్‌ టీం లక్ష్మీరెడ్డి ఇంట్లో నిందితులకు సంబంధించిన ఆధారాలు, చేతి వేలిముద్రలను సేకరించారు. ఈ చోరీపై హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు