భారీ చోరీతో కలకలం

29 Jul, 2018 11:53 IST|Sakshi
చోరీకి గురైన దుకాణాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అన్నపూర్ణ, తదితరులు

మోమిన్‌పేట : ప్రధాన రహదారిపై ఉన్న దుకాణంలో భారీ చోరీ మోమిన్‌పేట ప్రజలు భయాందోళనకు గురిచేస్తోంది.  పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న శ్రీశాంకరీ ఎంటర్‌ప్రైజెస్‌లో 68 తులాల బంగారం, రూ.96వేల నగదును దర్జాగా దొంగలు అపహరించుకొని పోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్ద మొత్తంలో చోరీ జరగడం మండలంలో ఇది మొదటిసారి. ఈ చోరీలోని దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన 9మంది డైరెక్టర్లుగా శ్రీశాంకరీ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏడాది క్రితం ప్రారంభించారు. ఇందులో బంగారం తాకట్టుపెట్టుకొని డబ్బులు అప్పుగా ఇస్తారు. తొమ్మిది మందిలో ఒకడైన మల్లేశ్, అతడికి సహాయకుడిగా మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన రియాద్‌లు వ్యాపారం నడిపిస్తున్నారు. ప్రతి రోజు లావాదేవీలు ముగిసిన తర్వాత దుకాణంలో ఉన్న ఇనుప పెట్టెలో బంగారం, నగదును ఉంచి తాళం వేసి తాళంచెవులను దుకాణంలోనే మల్లేశ్, రియాద్‌లకు తెలిసిన ప్రదేశంలో దాచేస్తారు.  

అన్ని కోణాల్లో దర్యాప్తు 
దుకాణంలోని సీసీ కెమెరాలు గురువారం ఉదయం నుంచి పనిచేయడం లేదని నిర్వాహకుడు మల్లేశ్‌ చెబుతున్నారు. అయితే సీసీ కెమెరాలు పనిచేయని రోజు సాయంత్రమే దొంగతనం జరిగింది. దుకాణం వెనుక ఉన్న వెంటిలేటర్‌ చువ్వలను తొలగించిన దొంగలు.. దర్జాగా దూరి బంగారంతో పాటు నగదును అపహరించుకుపోయారు. అయితే తాళంచెవులు దాచిన సంగతి మల్లేశ్, రియాద్‌లకు ఇద్దరికే తెలుసు. దాచి ఉన్న తాళంచెవులు దొంగలకు ఎలా దొరికాయనేది మిస్టరీ. ఇది పూర్తిగా తెలిసినవారి పనేనని పలువురు అనుమానిస్తున్నారు. దొంగలు మొదట ఇనుపపెట్టెను తెరిచేందుకు పలు విధాలుగా ప్రయత్నించి ఉండాలి. కానీ అలాంటిదేదీ చేయకుండా నేరుగా దాచిన వారు వచ్చి తాళం తీసి ఇనుపపెట్టె తెరిచినట్లుగా దొంగలు తమ పని కానిచ్చి వెళ్లిపోయారు. ఈ కేసులో వివరాలు సేకరించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, ఘటనా స్థలాన్ని శనివారం ఎస్పీ అన్నపూర్ణ సైతం పరిశీలించారు.

దొంగలను త్వరలో పట్టుకుంటాం
మోమిన్‌పేట : బంగారం తాకట్టు దుకాణంలో చోరికి పాల్పడిన దొంగలను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ అన్నపూర్ణ పేర్కొన్నారు. శనివారం మోమిన్‌పేట మండల కేంద్రంలో గురువారం రాత్రి చోరీకి గురైన  శ్రీశాంకరీ ఎంటర్‌ప్రైజెస్‌ తాకట్టు దుకాణంను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణంలో దొంగతనం జరిగిన రోజే మరమ్మతులకు గురైన సీసీ కెమెరాలను ఆమె పరిశీలించారు. అదే విధంగా అంతకు ముందు నమోదైన ఫూటేజీ, రాత్రి సమయంలో ఎవరెవరు ఆ వీధి గుండా సంచరించారో.. కాలనీలోని సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దొంగతనానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు. ఆమె వెంట సీఐ శ్రీనివాస్, ఎస్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు