పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

20 Jul, 2019 09:15 IST|Sakshi
వసతి గృహం వద్ద విచారణ చేస్తున్న సీఐ రవీంద్రనాథ్‌

పోలీస్, విజిలెన్స్‌ విచారణ

యూనివర్సిటీ క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం రేపింది. దీనిపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ అయింది. దీంతో క్యాంపస్‌ పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది విచారణ చేశారు. వివరాలు.. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలోని అనుబంధ వసతి గృహాల్లో ఒకటైన హరిణి బ్లాక్‌లో సోమవారం దొంగతనం జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ సంఘటనను వారు గోప్యంగా ఉంచారు. ప్రిన్సిపల్‌ కందాటి మహదేవమ్మ, వార్డెన్‌ విద్యుల్లత అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. ఈ విషయం విద్యార్థుల ద్వారా మీడియాకు చేరింది. దీనిపై శుక్రవారం  పలు టీవీ చానళ్లలో స్క్రోలింగ్‌లు, సోషల్‌ మీడియాలో  ట్రోలింగ్‌ అయ్యింది. పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు హరిణి బ్లాక్‌లో విచారణ చేశారు. సోమవారం 11 నుంచి 19 నంబర్లు కలిగిన గదుల్లో విద్యార్థినుల బ్యాగులను కత్తితో కోసి, అందులో ఉన్న తినుబండారాలు, నగదు, వెండి పట్టీలు, కొందరి చెవి కమ్మలు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. 

విద్యార్థి సంఘాల ఆందోళన
కళాశాల వసతి గృహంలో చోరీ నేపథ్యంలో ఏఐఎస్‌ఎఫ్, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీఆర్‌ఎస్‌ఐ సంఘాలు కళాశాల ఎదుట ఆందోళన చేశాయి. తరచూ దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోని వార్డెన్‌ విద్యుల్లతను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. విద్యార్థినుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తాయి. అయితే చిన్న దొంగతనమేనని,  5 వేల రూపాయల లోపు నగదు మాత్రమే దొంగతనానికి గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, తాము ఈ సమస్యను పరిష్కరిస్తామని కళాశాల ప్రిన్సిపల్, వార్డెన్లు హామీ ఇవ్వడంతో ఆందోళనకు తెరపడింది. 

పోలీసుల విచారణ
చోరీ ఉదంతంపై క్యాంపస్‌ సీఐ రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్, వార్డెన్‌తో చర్చించారు. సీఐ మాట్లాడుతూ, ఇది చిన్న దొంగతనమేనని చెప్పారు.  

దుష్ప్రచారం తగదు
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి డిగ్రీ కళాశాల పై దుష్ప్రచారం తగదని కళాశాల ప్రిన్సిపల్‌ మహదేవ మ్మ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విద్యార్థినులు  ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని కోరారు. అడ్మిషన్ల సమయంలో ఇలాంటి వ్యతిరేక ప్రచారం వల్ల కళాశాల ప్రతిష్టకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు