శ్రీకాళహస్తిలో భారీ చోరీ

18 Sep, 2018 06:16 IST|Sakshi
ఆధారాలు సేకరిస్తున్న వేలిముద్రల నిపుణులు

రూ.37 లక్షలు నగదు,

రూ.12 లక్షల విలువైన డైమండ్‌ గాజుల అపహరణ

డీఎస్పీ కార్యాలయం పక్క భవనంలోనే ఘటన

వేలిముద్రల నిపుణులు, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలన

చిత్తూరు, శ్రీకాళహస్తి: పట్టణంలోని శ్రీరామనగర్‌కాలనీ లోని డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న తొట్టంబేడు టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు గాలి అనసూయమ్మ కుమారుడు గాలి చలపతినాయుడు ఇంటిలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. చలపతి నాయుడు వ్యాపారవేత్త. ఆయన సోమవారం డీఎస్పీ పి.రామక్రిష్ణకు ఫిర్యాదు చేశారు. అందులో తాము ఆదివారం రాత్రి ఇంటి వద్ద లేమని తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించిన తమ పనివాళ్లు చోరీ జరిగినట్లు సమాచారం అందించారని పేర్కొన్నారు. రూ.37 లక్షల నగదు, రూ.12 లక్షలు విలువైన రెండు డైమండ్‌ గాజులు చోరీకి గురైనట్టు తెలిపారు.

డీఎస్పీ రామక్రిష్ణ, సీఐ మనోహర్‌ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. అలాగే డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. డాగ్‌ ఇంటి నుంచి సమీపంలోని బైపాస్‌ రోడ్డు వరకు వెళ్లింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు చోరీ కావడం శ్రీకాళహస్తిలో ఇదే ప్రథమం. అది కూడా డీఎస్పీ కార్యాలయం పక్క భవనంలో జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు