పోయిన వస్తువులు తిరిగొచ్చాయి..

31 Aug, 2019 10:56 IST|Sakshi
ఆపరేషన్‌ థియేటర్‌లో చోరీకి గురైన వస్తువులు

పంజగుట్ట: నిమ్స్‌ న్యూరో సర్జన్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జరీకి సంబంధించిన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోయాయనున్న వస్తువులు శుక్రవారం తెల్లవారు జామున యథాస్థానంలో కనిపించడం విశేషం. పోలీసులు, నిమ్స్‌ సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిమ్స్‌ అత్యవసర విభాగం మూడో అంతస్తులోని న్యూరో సర్జన్‌ ఆపరేషన్‌ థియేటర్‌ (ఎన్‌ఎస్‌ఓడీ)లో సర్జరీకి సంబంధించిన కత్తెర్లు, రాడ్‌లు, మరికొన్ని వస్తువులు గత ఆదివారం రాత్రి చోరీకి గురయ్యాయి. మర్నాడు దీనిని గుర్తించిన సిబ్బంది విభాగాధిపతికి సమాచారం అందించారు. ఆయన నిమ్స్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నిమ్స్‌ సెక్యూరిటీ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టడంతో భయపడిన  నిందితుడు శుక్రవారం తెల్లవారు జామున ఎవరూ లేని సమయంలో నల్లకలర్‌ బ్యాగ్‌లో చోరీకి గురైన వస్తువులు  తెచ్చి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఇంటిదొంగ పనే ...  
బయటివ్యక్తులు అత్యవసర విభాగంలోకి వెళ్లడం అసాధ్యం. ఆస్పత్రి సిబ్బందే చోరీకి పాల్పడి ఉండవచ్చునని, పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో భయపడి తిరిగి తెచ్చి పెట్టి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో కేసు నమోదు చేయాలని కోరిన నిమ్స్‌ సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు కేసు వద్దని తమ వస్తువులు ఇచ్చేయాలని కోరడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులెవరో తేలుస్తామని, సదరు వస్తువులు కోర్టుకు సమర్పించనున్నట్లు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు