లెక్కిస్తానని వచ్చి నొక్కేశాడు

16 Nov, 2017 03:03 IST|Sakshi

హుండీ లెక్కింపులో ఓ ప్రబుద్ధు్దడి చేతివాటం  

వేములవాడ: సేవ పేరుతో రాజన్నకు ఉచిత సేవలందిస్తానని వచ్చిన చేగుంట నారాయణ అనే వ్యక్తి హుండీ లెక్కింపులో నోట్లు నొక్కేసి ఎస్పీఎఫ్‌ సిబ్బందికి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు చెందిన చేగుంట నారాయణను అక్కడి సత్యసాయి ట్రస్ట్‌ ఇన్‌చార్జీ వలపి బాలశేఖర్‌ ద్వారా హుండీ లెక్కింపులో స్వామివారి సేవ చేసేందుకు బుధవారం ఉదయం వచ్చాడు.

ఎస్పీఎఫ్‌ సిబ్బంది పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ డబ్బులను చూసిన నారాయణ  రూ.2 వేలనోట్లు 15, రూ.500 నోట్లు 64, ఒకటి రూ.వంద నోటు, తొమ్మిది పదిరూపాయల నోట్లు, రూ.ఇరవై  నోటు ఒకదాన్ని తన నడుముకున్న లుంగీలో చుట్టేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వి.సురేందర్‌ దీనిపై కన్నేశాడు. కాసేపటి తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళతానంటూ నారాయణ మెల్లగా నడవసాగాడు. గమనించిన సురేందర్‌కు అనుమానం పెరిగి, నారాయణను ప్రశ్నించి, పక్కనే గదిలోకి తీసుకెళ్లి తనిఖీ చేశాడు. దీంతో రూ. 62,210 నగదు దొరికింది. వెంటనే విషయాన్ని ఈవో దూస రాజేశ్వర్‌కు తెలిపారు. ఈవో వెంటనే టౌన్‌ సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించడంతో ఎస్సై సైదారావు, స్పెషల్‌పార్టీ పోలీసు మనోహర్‌ నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు