ఆలయాలే టార్గెట్‌గా..

23 Oct, 2019 10:50 IST|Sakshi
లోలంలో దుండగులు ధ్వంసం చేసిన గేటు, గోవింద్‌పల్లిలో దొంగలు పగులగొట్టిన హుండీ

ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఒక్కరోజే మూడు దేవాలయాలను కొల్లగొట్టారు. ధర్పల్లి మండలంలోని రెండు గుళ్లతో పాటు ఇందల్వాయి మండలంలో ఓ గుడిలోకి చొరబడ్డారు. దేవుళ్ల నగలతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలతో స్థానికంగా కలకలం రేగింది.

సాక్షి,ధర్పల్లి(నిజామాబాద్‌) : మండలంలోని గోవింద్‌పల్లి గ్రామ శివారులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఆలయంలోని గర్భగుడి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డారు. స్వామివారి మీద గల బంగారు, వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దొంగిలించారు. భక్తులు గత ఏడాది నుంచి డబ్బులను కానుకలుగా హుండీలో సమర్పిస్తున్నారు. దీంతో హుండీలో సుమారు రూ.50 వేలకు పైగానే డబ్బు ఉంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన ఆలయాన్ని మంగళవారం పరిశీలించారు. దొంగల కోసం చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మద్దుల్‌ ఆలయంలోనూ.. 
మండల కేంద్ర శివారులోని మద్దుల్‌ అటవీ ప్రాంతంలో గల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు పడ్డారు. చానల్‌ గేట్‌ తలుపులను పగులగొట్టి స్వామివారి మీద గల వెండి ఆభరణాలు, హుండీ పగులగొట్టి రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారమందుకున్న ఎస్సై పాండేరావు చోరీ జరిగిన శ్రీలక్ష్మినర్సింహాస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

లోలం పెద్దమ్మ ఆలయంలో..
ఇందల్‌వాయి: మండలంలోని లోలం గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయంలోకి సొమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. హుండీ పగలగొట్టి దాదాపు రూ.7 వేల నగదు, అమ్మవారి పుస్తెమట్టెలు, పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం గేటుకు వేసిన తీళం పగలగొట్టి, బీరువాను ధ్వంసం చేశారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కేసు నమోదు చేసుకున్నారని సర్పంచ్‌ మమత చెప్పారు.

మరిన్ని వార్తలు