రెండోరోజు ఈడీ ముందుకు రాబర్ట్‌ వాద్రా

7 Feb, 2019 14:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా రెండోరోజు గురువారం కూడా ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విదేశాల్లో అక్రమాస్తులు, ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై వాద్రా బుధవారం తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రెండోరోజు రెండు గంటలపాటు వాద్రాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లండన్‌లోని ఆయన ఆస్తులపై ప్రధానంగా విచారించినట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల వ్యవహారంలో వాద్రా ఓ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. బుధవారం వాద్రాను దాదాపు ఐదున్నర గంటలపాటు విచారించిన అధికారులు, 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. బుధవారం వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం తెలిసిందే.

కాగా, తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందని వాద్రా అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిలు కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా, ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది.

ఆర్థిక లావాదేవీలు, లండన్‌లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టన్‌ స్క్వేర్‌లో 1.9 మిలియన్‌ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, ఇందుకు ఆర్థికంగా ఆయన అక్రమ మార్గాలను వాడినట్లు ప్రధాన ఆరోపణ. లండన్‌లో మరికొన్ని ఆస్తులను వాద్రా అక్రమంగా కలిగి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది.

మరిన్ని వార్తలు