చోరీకి వచ్చి మహిళపై హత్యాయత్నం

21 Jan, 2019 13:09 IST|Sakshi
సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కళ్లల్లో కారంకొట్టి ఆపై కర్రతో తలపై మోదిన ఆగంతకుడు

గ్యాస్‌ పైపుతో శరీర భాగాలను కాల్చి హింసించిన వైనం

చేతికున్న నాలుగు బంగారు గాజులను అపహరించి పరారైన నిందితుడు

గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు

గుంటూరు, పేరేచర్ల(ఫిరంగిపురం): మద్యానికి బానిసై చేతిలో డబ్బులు లేక దొంగతానికి పూనుకొన్నాడు. పక్కా స్కెచ్‌ వేసి తన ఇంటి పక్క ఇంటిలో జొరబడి ముసుగు వేసుకొని గుంటనక్కలా నక్కి మహిళ బయటకు రాగానే ఆమె కళ్లలో కారం కొట్టి ఆపై కర్రతో తలపై మోదాడు. తీవ్ర రక్త స్రావం అవుతున్న ఆమె మృతి చెందలేదని తెలుసుకొని గ్యాస్‌ సిలండర్‌కు ఉన్న పైపు తీసి ఆమె శరీర భాగాలపై కాల్చి చేతికున్న నాలుగు గాజులు లాక్కుని ఉడాయించాడు. తేరుకొన్న మహిళ స్థానికులను కేక వేయడంతో వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్నడూ ఊహించని ఈ ఘటనతో ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

ఇంటిలో నక్కిన దుండగుడు
ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం... తొర్లికొండ బాబూరావు వేములూరిపాడులో అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తన ఇంటి పక్కనే నివాసముంటున్న తాటి శివకుమారికి భర్త లేకపోవటం, కొడుకులు ఇద్దరు విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా నివసిస్తుందని తెలుసుకొని ఆమె ఇంట్లో దొంగతనం చేయటానికి అదునుగా భావించాడు. ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో గోడ దూకి దుప్పటి కప్పుకొని శివకుమారి ఇంటి ముందు నక్కాడు. ఆమె కాలకృత్యాలు తీర్చుకోవటానికి బయటకు రాగానే నిందితుడు తన వెంట తెచ్చుకొన్న కారం ఆమె కళ్లలో కొట్టి వెంటనే కర్రతో తలపై మోదాడు. ఆమె తలకు బలంగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం అవడంతో చనిపోలేదని తెలుసుకొని వంట గదిలోకి ఆమెను ఈడ్చుకొని వెళ్లి అక్కడ ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పైపు తీసి దానిని వెలిగించి ఆమె శరీర భాగాలను కాల్చడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమె చేతికున్న నాలుగు బంగారు గాజులను లాక్కొని పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన శివకుమారి స్థానికులకు ఘటన విషయం చెప్పటంతో  108లో గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది బాబూరావే అని బాధితురాలు పోలీసులకు స్పష్టంగా చెప్పటంతో అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ
విషయం తెలుసుకొన్న నర్సరావుపేట డీఎస్పీ డి.రవివర్మ, గుంటూరు రూరల్‌ సీసీయస్‌ డీఎస్పీ వై.రవికృష్ణకుమార్‌ సిబ్బందితో కలసి ఘటన  స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లను, బంధువులను పిలిపించి ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీశారు. విదేశాల్లో ఉన్న బాధితురాలి కొడుకులతో మాట్లాడారు. నిందితుడు పరారవడంతో నిందితుడి తల్లి, కుమారుడును అదుపులోకి తీసుకొన్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు
తాటి శివకుమారిపై దాడి చేసి అనంతరం ఆమె చేతి గాజులతో ఉడాయించిన బాబూరావును రూరల్‌ ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు రూరల్‌ సీసీయస్‌ పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకొని అదుపులోకి తీసుకొన్నారు. సీసీయస్‌ డీఎస్పీ వై.రవికృష్ణ కుమార్, నర్సరావుపేట రూరల్‌ సీఐ బీసీహెచ్‌ చినమల్లయ్య  ఆదివారం ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడిని గుంటూరు పూలమార్కెట్‌ సెంటర్‌ వద్ద గాజులు విక్రయిస్తుండగా పట్టుకొన్నట్లు తెలిపారు. నిందితుడు నుంచి నాలుగు గాజులు రికవరీ చేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు