దూరపు చుట్టంతో ఎఫైర్‌.. పెళ్లికి ముందే కొడుకు!

1 May, 2019 12:51 IST|Sakshi
రోహిత్‌ శేఖర్‌ తివారీ భార్య అపూర్వ శుక్లా

న్యూఢిల్లీ: రోహిత్‌ శేఖర్‌ తివారీ హత్యకేసులో అరెస్టయిన అతని భార్య అపూర్వ శుక్లా పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపెట్టారు. తన భర్తకు పెళ్లిముందే ఒక కొడుకు ఉన్నాడని, ఆ కొడుకునే ఆయన ఆస్తికి వారసుడిని చేయాలని భావించారని, అందుకే రోహిత్‌ను చంపేసినట్టు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించారు. రెండురోజుల పోలీసు రిమాండ్‌లో ఉన్న ఆమె తన వైవాహిక జీవితం, రోహిత్‌తో ఎదురైన సమస్యలు.. హత్యకు దారితీసిన పరిస్థితులు క్షుణ్నంగా పూస గుచ్చినట్టు వివరించారు.


రోహిత్‌ శేఖర్‌ తివారీ, అపూర్వ శుక్లాల పెళ్లి ఫొటో

రోహిత్‌కు పెళ్లి ముందునుంచే వివాహేతర సంబంధం ఉండటం తనను తీవ్రంగా దహించివేసిందని, అతనికి ఓ దూరపు చుట్టమైన మహిళతో అత్యంత సాన్నిహిత్యం ఉందని ఆమె పోలీసులకు తెలిపారు. ‘ఆ మహిళ తన కొడుకు రోహిత్‌ ఆస్తిలో వాటా ఇవ్వాలని తరచూ కోరేది. మీ ఇంటి కొడుకే కదా అని తరచూ అంటుండేది. రోహిత్‌ కూడా ఆ పిల్లాడిపై ప్రేమ, ఆప్యాయతలు ఉండటం నా అనుమానాలను పెంచింది’ అని ఆమె తెలిపింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అపూర్వ తాను తరచూ ఇండోర్‌, ఢిల్లీ మధ్య పర్యటించేదానినని, ఇండోర్‌ జిల్లా కోర్టుతోపాటు సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్‌ చేస్తుండటంతో అనంతరం ఢిల్లీకి మారానని ఆమె తెలిపారు.

రాజకీయ ఆశయాలు ఉండటంతో మాట్రిమోనియల్‌ సైట్‌లో దివంగత నాయకుడు ఎన్డీ తివారీ కొడుడైన శేఖర్‌ తివారీ ప్రొఫైల్‌ను చూడగానే ఎంచుకున్నానని, ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్‌ చేసిన తర్వాత 2018 మే 11న తాము పెళ్లి చేసుకున్నామని, కానీ, తమ వైవాహిక జీవితం ఎక్కువరోజులు నిలబడలేదని, అత్తింటివారితో సరిపడకపోవడంతో అదే ఏడాది మే 29న అత్తింటిని వీడి వచ్చానని ఆమె తెలిపారు. అనంతరం జులైలోనే రోహిత్‌కు విడాకుల నోటీసులు పంపానని, కానీ, హృదయ సంబంధ వ్యాధితో అతను ఆస్పత్రిలో చేరడంతో అతన్ని పరామర్శించాక.. తమ అనుబంధాన్నికొనసాగించాలని భావించానని ఆమె తెలిపారు. అత్త ఉజ్వల సింగ్‌ కూడా తరచూ తనను వేధించేదని, ఆమె అనుమతి లేకుండా కనీసం బెడ్‌రూమ్‌ కర్టైన్‌ కూడా మార్చనిచ్చేది కాదని అపూర్వ తెలిపారు.

అంతేకాకుండా రోహిత్‌ తండ్రి అతనికి వారసత్వంగా ఆస్తులేవీ ఇచ్చి వెళ్లలేదని, ఢిల్లీ ఢిపెన్స్‌ కాలనీలోని నివాసం కూడా అతని తల్లిదేనని అపూర్వకు తెలియడం ఆమెలో కోపాన్ని మరింత పెంచిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ‘రోహిత్‌ క్రూరంగా ప్రవర్తించేవాడు. అతను నన్ను ప్రేమించలేదు. మేం ఎప్పుడు అతని ఎఫైర్‌ గురించి గొడవపడేవాళ్లం. సర్దిచెప్పడానికి బదులు ఆ అఫైర్‌ గురించి అతను గొప్పలు చెప్పుకునేవాడు. అందుకే అతన్ని నేను చంపేశా’ అని అపూర్వ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు