తల్వార్‌తో రౌడీషీటర్‌ వీరంగం

30 Jul, 2019 11:22 IST|Sakshi
గాయపడిన సాయివినయ్‌, కిరణ్‌ , లక్ష్మణ్‌

లంగర్‌హౌస్‌: బస్తీలో మద్యం తాగుతూ గొడవ చేయవద్దు అన్నందుకు ఓ రౌడీషీటర్‌ తల్వార్‌తో దాడి చేయడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడిన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్దరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గండిపేట మండలం, గంధంగుడ గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్‌ బిట్టు రౌడీషీటర్‌. ఇతనిపై దారి దోపిడీ, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఆదివారం రాత్రి అతను నార్సింగికి చెందిన లక్ష్మణ్‌తో కలిసి లంగర్‌హౌస్‌ వచ్చారు. ఇద్దరు కలిసి అంబేద్కర్‌నగర్‌లోని ఓ కిరాణా దుకాణం ఎదుట ఉన్న ఆటోలో కూర్చొని మద్యం తాగారు. మద్యం మత్తులో కేకలు వేస్తుండటంతో దుకాణ యజమాని బయటికి వచ్చి వారిని నిలదీయగా అదే ప్రాంతానికి చెందిన సాయి స్నేహితులమని చెపాక్పరు. వెళ్లకపోతే పోలీసులను పిలుస్తా అని యజమాని ఫోన్‌ తీసుకోగా అతడిని చంపుతామని బెదిరించారు.

దీంతో స్థానికులు అక్కడ గుమిగూడటంతో...
వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లాల్‌దర్వాజ అమ్మవారి దర్శనం చేసుకొని స్నేహితులతో కలిసి ఇంటికి వస్తున్న సాయి వినయ్‌ స్థానికులను వివరాలు అడగ్గా ఇద్దరు వ్యక్తులు నీ పేరు చెప్పి తాగుతు గొడవ చేసినట్లు తెలిపారు. వారు బాపూఘాట్‌ వైపు వెళ్లినట్లు చెప్పడంతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన సాయికి ఆరాధన హోటల్‌ ఎదుట నాగరాజు లక్ష్మణ్‌ కనిపించారు. దీంతో అతను లక్ష్మణ్‌ను పక్కకు పిలిచి బస్తీకి వచ్చి తాగి గొడవ చేసి తమకు చెడ్డ పేరు తేవద్దని కోరాడు. దీంతో ఆగ్రహానికిలోనైన నాగరాజు తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కిరణ్, సాయి వినయ్, లక్ష్మణ్, సునీల్‌కుమార్, సాయి కిరణ్‌లకు గాయాలయ్యాయి. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సుందర్, విజయ్‌కుమార్‌లపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను  ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు