గుట్టు.. రట్టు 

8 Feb, 2018 07:16 IST|Sakshi
భారీ పిడికత్తితో కేక్‌ కట్‌ చేస్తున్న రౌడీ బిన్ని

అర్ధరాత్రి వేళ మద్యం, మాంసాహారంతో చిందులు

75 మంది అరెస్ట్, 50 మంది పరార్‌

భారీ సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం

సాక్షి ప్రతినిధి, చెన్నై: రోడ్డు ఇరువైపులా రంగు రంగుల లైట్ల తోరణాలు, పెట్టెలు పెట్టెలుగా మద్యం, భారీ సంఖ్యలో గొర్రెలు, పొట్టేళ్లతో మాంసాహార విందు, చెవులు హోరెత్తించే సినిమా పాటలు...వాటి మధ్యలో పెద్ద సంఖ్యలో యువకుల చిందులు. ఇదేదో పెద్ద రాజకీయనేత తన అనుచరులకు ఇచ్చిన పార్టీ కాదు, పేరొందిన రౌడీ తన సహచర రౌడీలతో కలిసి చేసుకున్న జన్మదిన సంబరాలు. మంగళవారం అర్ధరాత్రి చెన్నై శివార్లలో రౌడీల ముఠా చేసుకుంటున్న పార్టీపై పోలీసులు దాడి చేసి 75 మందిని అరెస్ట్‌ చేసి, భారీ ఎత్తున మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ జన్మదిన సంబరాలు, పోలీసులు మట్టుబెట్టిన వైనం క్రైం సినిమాను తలపించాయి. వివరాల ఇలా ఉన్నాయి. 

చెన్నైలో నేర నేపథ్యం కలిగి ఉన్న వ్యక్తులపై రౌడీల నిరోధక విభాగం పోలీసులు కొంతకాలంగా రహస్యంగా నిఘాపెట్టి ఉన్నారు. 2012–16 మ«ధ్యకాలంలో చిన్నపాటి దొంగతనాలు, నేరాలు చేసిన 14,551 మంది రౌడీలను పోలీసులు గుర్తించారు. చెన్నైకి చెందిన వారు మాత్రమే 11,303 మంది కాగా మిగిలిన 3,248 మంది చెన్నై శివార్లు, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నారు. తరచూ నేరాలకు పాల్పడేవారిపై గూండా చట్టాన్ని ప్రయోగించి జైళ్లలోని నెట్టడంతో చెన్నైలో రౌడీల కదలిక తగ్గింది. అయితే వారంతా పొరుగు జిల్లాలైన కాంచీపురం, తిరువళ్లూరు, జిల్లాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా, చెన్నై శివారు పల్లికరణై వద్ద మంగళవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా రెండు బైకుల్లో అతివేగంగా వెళుతున్న నలుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు.

వారంతా ఖరీదైన దుస్తులు ధరించి, మేకప్‌ వేసుకుని పూలబొకేతో ఉండడంతో పోలీసులు ఆరాతీయగా వారిలో ఇద్దరు రౌడీల జాబితాలో ఉన్నవారు. ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించగా, చెన్నై శివారు మీంజూరు రింగ్‌రోడ్డు సమీపంలోని ఒక లారీ షెడ్డులో చెన్నై సూలైమేడుకు చెందిన బిన్ని అలియాస్‌ బిను (40) పేరొందిన రౌడీ జన్మదినం జరుగుతున్నదని, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్నట్లు వారు చెప్పారు. తమతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రౌడీలు హాజరవుతున్నట్లు తెలిపారు. దీంతో బిత్తరపోయిన పోలీసులు చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌కు సమాచారం ఇచ్చారు. అంబత్తూరు డిప్యూటీ కమిషనర్‌ సర్వేష్‌రాజ్‌ నేతృత్వంలో ఇద్దరు సహాయ కమిషనర్లు, పది మంది ఇన్స్‌పెక్టర్లు, 15 మంది ఎస్‌ఐలు, 40 మందికి పైగా ఇతర సిబ్బంది తుపాకీలు తీసుకుని ప్రయివేటు కాల్‌టాక్సీలో రౌడీ జన్మదినం జరుగుతున్న లారీ షెడ్డుకు బయలుదేరారు. వండలూరు –మీజూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వెళుతుండగా రోడ్డుకు ఇరువైపులా రంగు రంగుల సీరియల్‌ లైట్ల తోరణాలు, మైక్‌సెట్లలో పాటల హోరు సాగుతూ రౌడీలున్న లారీ షెడ్డు వద్ద ఈ అలంకరణలు ముగిశాయి.

పోలీసులు తమ వాహనాలను దూరంగా ఆపివేసి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూడగా, లారీ షెడ్డు సమీపంలో 50కి పైగా గొర్రెలు, నాటుకోళ్లతో వంటలు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా హాజరవుతున్న రౌడీలకు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ స్వాగతం చెబుతున్న దృశ్యాలు, రౌడీ బినుకు వేసేందుకు సిద్ధంగా ఉంచిన గజమాల కనపడ్డాయి. రౌడీలంతా భయంకరమైన మారణాయుధాలు సిద్ధంగా ఉంచుకుంటారని అంచనావేసిన పోలీసులు తుపాకీలతో లారీ షెడ్డును చుట్టుముట్టి అకస్మాత్తుగా లోనికి చొరబడ్డారు. మద్యం తాగుతూ మాంసాహారం తింటూ చిందులు వేస్తున్న సుమారు 150 మంది రౌడీలు పోలీసులను చూడగానే తలోదిక్కుగా పరుగులు పెట్టారు.  అయితే పోలీసులు తుపాకీలతో వారిని చుట్టుముట్టి 75 మందిని అదుపులోకి తీసుకోగా మరో 50 మంది తప్పించుకున్నారు. జన్మదినం జరుపుకుంటున్న బిన్నిపై అనేక పోలీసుస్టేషన్ల పరిధిలో పలు హత్య, హత్యాయత్నం నేరాలు విచారణలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

బర్త్‌డే కేక్‌ కట్‌ చేసేందుకు సైతం రౌడీ బిన్ని పొడవాటి పిడికత్తిని వినియోగించాడు. రౌడీలందరికీ సంప్రదాయబద్ధంగా జన్మదిన ఆహ్వానాలు పంపి తన బలాన్ని నిరూపించుకునేందుకే బిన్ని ఈ పార్టీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో ఒక న్యాయవాది, కొందరు  కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. అరెస్ట్‌ చేసిన రౌడీల నుంచి 35కు పైగా భయంకరమైన మారణాయుధాలు, 50కి పైగా సెల్‌ఫోన్లు, 50 బైకులు, 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన రౌడీలు, లారీ షెడ్డు యజమానిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రౌడీలు తమ నేరాల ప్రణాళిక, సమాచారం చేరిక కోసం ఒక ప్రత్యేక యాప్‌ను సైతం సిద్ధం చేసుకున్న సంగతి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల పరిశీలనలో తేలింది.

మరిన్ని వార్తలు